
సాక్షి, న్యూఢిలీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) విషయంలో విపక్ష ‘ఇండియా’కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం స్తంభింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సమావేశం కావాలని విపక్ష కూటమి నేతలు నిర్ణయించారు.
ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఈ విందు భేటీ జరుగనుంది. ఎస్‌ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేస్తారని సమాచారం. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 70–80 సీట్లు రిగ్గింగ్‌కు గురయ్యాయని రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు.
నరేంద్ర మోదీ అత్యంత తక్కువ మెజారీ్టతో ఈసారి ప్రధానమంత్రి అయ్యారని, రిగ్గింగ్ జరగకపోయి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంతోపాటు ఆపరేషన్ సిందూర్, భారత్‌పై అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందం తదితర అంశాలు విందు భేటీ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు శరద్ పవార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరు కానున్నారు. ‘ఇండియా’కూటమి నేతలు చివరి సమావేశం జూలై 19న వర్చువల్‌గా జరిగింది.