
న్యూఢిల్లీ: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యరి్థపై తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష ‘ఇండియా’కూటమి నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ పోటీ పడడమే సరైన వ్యూహమని భావిస్తున్నట్లు సమాచారం.
ఫలితంతో సంబంధం లేకుండా అధికార కూటమికి బలమైన సందేశం ఇవ్వదలిచామని ఇండియా కూటమి నేతలు గురువారం వెల్లడించారు. పార్లమెంట్‌లో మొత్తం ఓట్లు 782 కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గాలంటే 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 423 ఓట్ల బలం ఉంది. ఇండియా కూటమికి సానుకూలంగా 313 ఓట్లు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు.