వాణిజ్య బంధం బలోపేతం | India and New Zealand Sign Historic Free Trade Agreement | Sakshi
Sakshi News home page

వాణిజ్య బంధం బలోపేతం

Apr 28 2026 4:56 AM | Updated on Apr 28 2026 6:20 AM

India and New Zealand Sign Historic Free Trade Agreement

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్, న్యూజిలాండ్‌ సంతకాలు  

100 శాతం భారత ఎగుమతులపై సున్నా సుంకాలు  

భారత్‌లో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు న్యూజిలాండ్‌ అంగీకారం  

54.11 శాతం న్యూజిలాండ్‌ ఉత్పత్తులపై సున్నా సుంకాలు అమలు చేయనున్న భారత్‌  

న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్‌ మధ్య స్నేహసంబంధాల్లో మరో అడుగు ముందుకు పడింది. కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు, తోలు పాదరక్షలు, రత్నాలు. ఆభరణాలతో సహా 100 శాతం ఎగుమతులపై న్యూజిలాండ్‌లో సుంకాలు సున్నాకు చేరుకుంటాయి. సుంకాలు లేకుండానే భారత్‌ తమ ఉత్పత్తులను న్యూజిలాండ్‌ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. ఈ ఒప్పందానికి న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

 భారత్‌లో కేంద్ర మంత్రివర్గం ఈ ఎఫ్‌టీఏను ఇప్పటికే ఆమోదించింది. ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, న్యూజిలాండ్‌ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాన్‌ మెక్‌క్లే సోమవారం ఢిల్లీలో సంతకాలు చేశారు. ఎఫ్‌టీఏతో ఇరుదేశాల మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య 2010లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో నిలిచిపోయాయి. గతేడాది మార్చిలో చర్చలు పునఃప్రారంభం కాగా, డిసెంబర్‌లో ముగిశాయి. తాజాగా సంతకాలు జరిగాయి.  
   
ఎఫ్‌టీఏతో ప్రయోజనాలు  
→ న్యూజిలాండ్‌కు భారత్‌ చేసే 100% ఎగుమతులకు ఎలాంటి సుంకం ఉండదు. గతంలో న్యూజిలాండ్‌ సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలతో సహా పలు భారతీయ ఉత్పత్తులపై 10 శాతం వరకు సుంకాలను విధించేది.  

→ ఎఫ్‌టీఏలో భాగంగా రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్‌ అంగీకరించింది.  

→ భారతీయ వృత్తి నిపుణులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారికి మూడేళ్ల కాలపరిమితి ఉండే వీసాలు ఇస్తారు. 

→ భారత్‌ నుంచి సుంకం రహిత వైన్, స్పిరిట్స్‌ ఎగుమతులు జరుగుతాయి. అదే సమయంలో న్యూజిలాండ్‌ నుంచి మద్యం రాయితీ సుంకంతో భారత్‌లోకి ప్రవేశిస్తుంది. పదేళ్లలో ఈ సుంకాన్ని మరింత తగ్గిస్తారు.  

→ న్యూజిలాండ్‌ నుంచి వచ్చేవాటిలో 54.11 శాతం ఉత్పత్తులపై సుంకాలను భారత్‌ సున్నాకు తగ్గిస్తుంది. ఇందులో గొర్రె మాంసం, ఉన్ని, బొగ్గు, అటవీ, కలప ఉత్పత్తులు ఉన్నాయి. భారత్‌లో వాటి ధరలు తగ్గుతాయి.  

→ న్యూజిలాండ్‌ యాపిల్, కివీ పండ్లు, తేనె, మిల్క్‌ అల్బుమిన్‌పై సుంకాల్లో రాయితీలు ఇస్తారు. అలాగే కొన్ని రకాల సముద్ర ఉత్పత్తులపై సుంకాలను రాబోయే ఏడేళ్లలో పూర్తిగా తగ్గిస్తారు.  

→ న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి అయ్యే ఐరన్, స్టీల్, స్క్రాప్‌ అల్యూమినియం వస్తువులపై సుంకాలను పదేళ్లు లేదా అంతకంటే ముందే పూర్తిగా         రద్దుచేస్తారు.  

→ భారతదేశ రైతులు, ఎంఎస్‌ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాడి, జంతు ఉత్పత్తులు(గొర్రె మాంసం మినహా), కూరగాయలు, చక్కెర, రాగి, అల్యూమినియంపై కేంద్ర ప్రభుత్వంన్యూజిలాండ్‌కు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు.  

సుసంపన్నమైన భవిష్యత్తు: మోదీ  
ఇండియా–న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దీంతో మన రైతులు, యువత, మహిళలు, ఎంఎస్‌ఎంఈలు, చేతి వృత్తుల నిపుణులు, కళాకారులు, స్టార్టప్‌ కంపెనీలు, విద్యార్థులు, నవీన ఆవిష్కర్తలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. 

ఒక తరంలో ఒక్కసారే: క్రిస్టోఫర్‌ లక్సన్‌  ఎఫ్‌టీఏను ‘ఒక తరంలో ఒక్కసారి మాత్రమే కుదిరే ఒప్పందం’గా న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ అభివర్ణించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఎగుమతులు చేసే అవకాశం న్యూజిలాండ్‌కు లభిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement