చార్మినార్ సహా 12 చోట్ల ఉత్సవాలు
భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆయుష్ శాఖ
కోల్‌కతాలో ప్రధాన కార్యక్రమానికి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: హరిద్వార్‌లోని గంగానది తీరం నుంచి హంపి శిథిలాలు, ఢిల్లీలోని ఎర్రకోట వరకు.. దేశవ్యాప్తంగా గల 12 చారిత్రాత్మక వేదికలు ఈ ఏడాది ’అంతర్జాతీయ యోగా దినోత్సవం’ వేడుకలకు వేదికలు కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 21న కోల్‌కతాలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. అదేసమయంలో, 12 ప్రాంతాలలో జాతీయ స్థాయి యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా విశిష్టతను చాటేందుకు కేంద్ర ఆయుష్ శాఖ యోగా డే నిర్వహణను ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ చారిత్రక కట్టడాల తరహాలోనే, యోగా కూడా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తూ ఎన్నో తరాలుగా సమాజానికి తోడ్పడుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఎంపిక చేసిన 12 ప్రాంతాలివే..
ఢిల్లీలోని ఎర్రకోట, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ హర్ కీ పౌరీ, ఒడిశాలో కోణార్క్ సూర్య దేవాలయం, కర్ణాటకలో హంపి కట్టడాలు, లద్దాఖ్‌లో లేహ్ ప్యాలెస్, తమిళనాడులో మహాబలిపురం తీర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లో సార్‌నాథ్, అసోంలో కంచరి కోట, హైదరాబాద్‌లో చార్మినార్, ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా, బిహార్‌లో
నలంద మహావిహార, అహ్మదాబాద్‌లో సబర్మతీ తీరం. ప్రతీ ప్రాంతం దేశ సాంస్కృతిక ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి చెప్పారు. సార్‌నాథ్, నలంద దేశ జ్ఞాన సముపార్జన, ధ్యాన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేవి కాగా, కోణార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం తీర దేవాలయం కళాత్మకత, అద్భుత నిర్మాణ కౌశలానికి శాశ్వత చిహ్నాలుగా నిలిచాయన్నారు. హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆధ్యాత్మికతకు ప్రతీకలు కాగా, ఎర్రకోట, చార్మినార్, గేట్‌వే ఆఫ్ ఇండియా, లేహ్ ప్యాలెస్‌లు దేశ చారిత్రక ప్రస్థానంలో కీలకమైన మైలురాళ్లను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
సరిహద్దులతో ప్రమేయం లేకుండా అందరినీ ఏకం చేయగల ప్రత్యేక సామర్థ్యం యోగాకు ఉందని చెప్పడమే కార్యక్రమ లక్ష్యమని మంత్రి చెప్పారు. లద్వాఖ్‌లోని హిమాలయ పర్వత సానువులు, హరిద్వార్‌లోని గంగానతీ తీరం, హంపి శిథిలాలు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాలు..ఇలా ఏప్రాంతమైనా తరాలను దాటి ప్రజలను అనుసంధానించే ఒక ఏకీకృత శక్తిగా యోగా నిలుస్తుందని జాదవ్ అన్నారు. భౌగోళికంగా, భాషాపరంగా వేరైనప్పటికీ ఈ చారిత్రక ప్రదేశాలన్నీ యోగా ద్వారా ఆరోగ్యం, సామరస్యం అనే ఒకే లక్ష్యంతో ఏకం కానున్నాయని ఆయన వివరించారు.


