రైలు, కోచ్ బుకింగ్ చేసుకోవచ్చని తెలుసా?.. ఎంత ఖర్చవుతుందంటే!

How To Book An entire Train Or Coach On IRCTC Details Inside - Sakshi

భారతీయ రైల్వే.. దేశంలో సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థ. ప్రతిరోజు సుమారు కొన్ని కొట్ల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. నేడు భారతీయ రైల్వే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ విస్తరించింది. అయితే రోజూ వేలాది రైళ్లు నడుస్తున్న రైలు టికెట్‌ పొందడం మాత్రం కష్టతరంగా మారుతోంది. 

రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, జనాభాకు సరిపడా రైళ్లు అందుబాటులో లేకపోవడం వంటి తదితర కారణాలతో నెల రోజుల ముందు బుక్ చేసుకున్నా  టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక అత్యవసరంగా బుక్‌ చేస్తే తప్పక వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉండిపోతుంది. 

ఒకటి రెండు టికెట్ల బుకింగ్‌ కోసమే అష్టకష్టాలు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో ఏకంగా కొన్ని కోచ్‌లు, లేదా రైలు మొత్తం బుక్‌ చేసుకోనే సదుపాయం ఉన్నదన్న విషయం అందరికీ తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా దాన్ని ఎలా బుక్‌ చేసుకోవాలనే దానిపై అవగాహన ఉండకపోవచ్చు.. అయితే రైలు, కోచ్‌లను ఎలా బుక్‌ చేసుకోవాలి, ఏ నిబంధనలు పాటించాలి, ఏ డాక్యుమెంట్లు అందించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రైల్వే సంస్థకు చెందిన IRCTC FTR యాప్‌ ద్వారా మొత్తం రైలు, లేదా కోచ్‌లను బుక్‌ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్‌లో రైలు బుక్‌ చేసుకుంటే అన్ని రైల్వే స్టేషన్‌ల నుంచి ప్రయాణించవచ్చు. కేవలం కోచ్‌ మాత్రమే బుక్‌ చేసుకోవాలనుకుంటే.. రైలు 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఆగిన స్టేషన్‌లలో మాత్రమే ప్రత్యేక కోచ్‌ను యాడ్‌ చేయడం, తొలగించడం జరుగుతుంది. అన్ని రైళ్లలో ఈ కోచ్‌లను జోడించడం సాధ్యం కాదు. 

బుకింగ్ వ్యవధి..
FTR రిజిస్ట్రేషన్ ప్రయాణ తేదికి గరిష్టంగా 6 నెలల ముందు.. కనీసం 30 రోజుల ముందు చేసుకోవచ్చు

కోచ్ బుకింగ్..
సాంకేతిక సదుపాయాలను అనుసరించి FTRలో ఒక రైలులో కనిష్టంగా రెండు కోచ్‌లను బుక్‌ చేసుకోవచ్చు. రెండు స్లీపర్‌ కోచ్‌లు..అదే గరిష్టంగా 24 కోచ్‌లు బుక్‌ చేసుకోవచ్చు.
చదవండి: ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్‌లో ఎన్ని భాషలంటే..
  

సెక్యూరిటీ డిపాజిట్..
ఆన్‌లైన్ బుకింగ్‌లో ప్రయాణానికి సంబంధించిన ప్రతి వివరాలను నమోదు చేయాలి. ప్రయాణ వివరాలు, కోచ్‌ వివరాలు, రూట్, ఇతర వివరాలను ఆన్‌లైన్ ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక్కో కోచ్‌కు రూ. 50,000/- సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఒకవేళ 18 కోచ్‌ల కంటే తక్కువ ఉన్న రైలు బుకింగ్ కోసం కూడా 18 కోచ్‌లకు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని..అంటే రూ. 9 లక్షలు చెల్లించాల్సిందే. ఏడు రోజుల వరకు కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు.  ఆ తర్వాత, రోజుకు/కోచ్‌కి అదనంగా రూ. 10,000 చెల్లించాలి.

బుకింగ్‌ విధానం
►రైలు లేదా కోచ్‌ని బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC అధికారిక FTR వెబ్‌సైట్ www.ftr.irctc.co.in కి వెళ్లాలి.

►ఇప్పుడు మీ ఖాతాను ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.  ఇప్పటి వరకు మీకు అకౌంట్‌ లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలి.

►పూర్తి కోచ్ బుకింగ్ కోసం FTR సర్వీస్ ఎంపికను ఎంచుకోండి.

►ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.

►ఆ తర్వాత ఫీజు చెల్లించాలి.. అంతే మీ ప్రయాణం బుక్‌ అయినట్లే.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
IRCTCలో మొత్తం రైలు లేదా కోచ్‌ను బుక్ చేసేటప్పుడు మీ ప్రయాణ తేదీకి కనీసం ఆరు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడం ఉత్తమం. అయితే మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గా అందించిన మొత్తాన్ని ప్రయాణం పూర్తయిన తరువాత తిరిగి రిఫండ్‌ చేస్తారు. అంతేగాక IRCTC మొత్తం రైలు, కోచ్ కోసం క్యాటరింగ్ సేవలను సైతం అందిస్తుంది.. దీనిని ముందుగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత మీ బుకింగ్‌ను రద్దు చేస్తే, మీకు రిజిస్ట్రేషన్‌ డబ్బులు అందవు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top