Sakshi News home page

హ్యాట్రిక్‌కు గ్యారంటీ

Published Mon, Dec 4 2023 4:55 AM

Hat-trick in state elections is guarantee of hat-trick in 2024 Says PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన హ్యాట్రిక్‌ విజయం.. 2024 ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల్లో సాధించబోయే హ్యాట్రిక్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ఘన విజయం తర్వాత ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ వందలాది మంది పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ మూడు రాష్ట్రాల్లో కలిపి హ్యాట్రిక్‌ సాధించాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే హ్యాట్రిక్‌ గెలుపునకు ఈరోజు విజయం గ్యారంటీని ఇస్తోంది.

ఇది చక్కని సంకేతం. ఈ ఫలితాలు అహంకార ‘ఇండియా’ కూటమికి గట్టి హెచ్చరిక. ఆత్మనిర్భరత, పారదర్శక, సుపరిపాలన భారత్‌ను కాంక్షించే బీజేపీ ఎజెండాకు ఈ గెలుపు మద్దతుగా నిలిచింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా గతంలో విపక్షాల అగ్రనేతలు గ్రూప్‌ ఫొటో దిగటాన్ని మోదీ ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు. ‘‘ స్టేజీ మీద వారసత్వ నాయకులంతా ఒక్క చోటకు చేరితే మంచి ఫొటోలు దిగగలరు. కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలుపొందలేరు. ఈ ఫలితాలు కాంగ్రెస్, దాని గర్విష్ఠి కూటమికి పెద్ద గుణపాఠం నేర్పాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రపంచదేశాల నమ్మకాన్ని పెంచుతోంది
మోదీ సర్కార్‌ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి తమ నేతలపై తప్పుడు అవినీతి కేసులను బనాయిస్తోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను మోదీ ప్రస్తావించారు. ‘ అవినీతికి వ్యతి రేకంగా మేం చేస్తున్న పోరాటానికి ప్రజలు ఈ ఫలితాల రూపంలో మాకు మద్దతు పలికారు. అవినీతిలో మునిగిన పారీ్టలకు ఓటర్లు ఈ ఫలితాల రూపంలో వారి్నంగ్‌ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి, ప్రజలకు మధ్య మరెవరూ రాలేరు. ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఓటర్లు ఇలాగే తీసి పక్కనపడేస్తారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు నాదో విన్నపం. దేశాభివృద్ధి ఊపందుకున్న ఈ తరుణంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాజకీయాలు చేయొద్దు.

దేశాన్ని విభజించే, విచి్ఛన్నం చేసే శక్తులతో జట్టుకట్టొద్దు’’ అని హితవు పలికారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో దేశ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేందుకు కష్టపడుతుంటాయి. అదను కోసం ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి వారితో జాగ్రత్త’ అంటూ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. ‘ఈ గెలుపు భారత్‌పై ప్రపంచదేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఇది భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ‘అభివృద్ధి చెందిన భారత్‌’ సాకారం కోసం మనం చేపడుతున్న ఎజెండాకు ప్రజా మద్దతుకు లభిస్తోందని ఈ ఫలితాలు చాటుతున్నాయి. దేశంలో చక్కటి మెజారిటీతో అధికారంలోకి వచ్చే సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్న విషయాన్ని ప్రపంచదేశాలు కళ్లారా చూశాయి’’ అని మోదీ అన్నారు.  

ఈ భూతాలను బీజేపీయే తరిమికొట్టగలదు
‘అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాల ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలనే ఈ మూడు భూతాలను తరిమికొట్టే సత్తా ఒక్క బీజేపీకే ఉందని యావత్‌ భారతదేశమే భావిస్తోంది. అవినీతి భరతం పట్టే బీజేపీకి ఇప్పటికే దేశవ్యాప్త మద్దతు దక్కుతోంది. అవినీతితో అంటకాగే నేతలకు ఇది సూటి హెచ్చరిక. అవినీతిపరులకు రక్షణగా ఉండే వ్యక్తులు, తప్పులను దాచిపెట్టే వ్యక్తులే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాళ్లొకటి గమనించాలి. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజా మద్దతు ఉందని ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా ఈ వ్యక్తులు అర్ధం చేసుకోవాలి’’ అని విపక్షాలను పరోక్షంగా విమర్శించారు.

ఆ కులాల సాధికారత దేశ సాధికారత
‘‘దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అని దేశంలో నాలుగే పెద్ద కులాలున్నాయి. ఈ కులాలు సాధికారత సాధించిననాడే దేశ సాధికారత సాధ్యపడుతుంది. దేశంలో దాదాపు అన్ని ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్‌ తెగల వారంతా ఈ నాలుగు వర్గాల్లోనే ఉన్నారు. బీజేపీ తమ విధాన నిర్ణయాలు, పథకాల ద్వారా వీరి సాధికారతకు కృషిచేస్తోంది. ఈ ఫలితాలొచ్చాక మేం గెలిచామని ప్రతి ఒక్క రైతు, యువజన ఓటరు, పేద, అణగారిన వర్గాల వ్యక్తులు గొంతెత్తి నినదిస్తున్నారు.

గొప్ప భవిష్యత్తు కోసం యువత కలలు కంటోంది. ఈ రోజు ఫలితాలు చూశాక 2027కల్లా అభివృద్ధిచెందిన భారత్‌ సాకారం అవుతుందని ప్రతి ఒక్క పౌరుడు భరోసాగా ఉన్నాడు. నిజాయితీగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీ స్వప్నం సాకారమవ్వాలనేదే నా సంకల్పం. ప్రపంచంలో భారత ఆర్థికాభివృద్ధి దూసుకుపోతూ దేశ మౌలికరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ స్వప్నాలు సాకారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ మోదీనే ఎంచుకుంటారు’’ అని రాసి ఉన్న భారీ కటౌట్‌ను బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు.

Advertisement

What’s your opinion

Advertisement