హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్‌ విధ్వంస ప్రక్రియ  | Sakshi
Sakshi News home page

హర్యానా అల్లర్లు: వివాదానికి కారణమైన సహారా హోటల్ కూల్చివేత 

Published Sun, Aug 6 2023 11:56 AM

Haryana Violence Nuh Hotel Demolished Fourth Day Bulldozer - Sakshi

చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను  ఆదివారం బుల్డోజర్‌లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.    

హర్యానాలో మతపరమైన అల్లర్లకు కారణమైన వారికి సంబంధించిన ఇళ్లను బుల్డోజర్‌తో కూలదోసేందుకు ఉపక్రమించింది హర్యానా పోలీసు శాఖ. ఇప్పటికే మూడు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆదివారం ఈ కార్యక్రమం నాలుగోరోజుకి చేరుకుంది. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. ఇందులో భాగంగా అల్లర్లకు ప్రధాన కారణమైన సహారా హోటల్‌ను కూడా కూల్చివేశారు అధికారులు. 

జులై 31న విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపుపై కొంతమంది సహారా హోటల్ పైభాగం నుండి రాళ్లు రువ్వడంతో ఈ వివాదం పురుడు పోసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో దగ్గర్లోని దేవాలయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అదేరోజు రాత్రి ఆ ప్రాంతంలోని మసీదు దగ్ధం కాగా అక్కడి నుండి గురుగ్రామ్ వరకు వందల కొద్దీ వాహనాలు  అగ్నికి ఆహుతయ్యాయి. 

అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారితో సహా ఆరుగురు మరణించగా వందల సంఖ్యలో సామన్యులు గాయపడ్డారు. అల్లర్లకు పాల్పడిన వారిలో చాలామంది అరెస్టులకు భయపడి వేరే ప్రాంతాలకు పారిపోయారు. దీంతో పోలీసులు నిందితులకు సంబంధించిన ఆస్తులను  లక్ష్యం చేసుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు.   

ఇది కూడా చదవండి: అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్   

Advertisement
Advertisement