
టాయిలెట్ సీటుపై కూర్చొని వర్చువల్‌గా హాజరైన వ్యక్తిపై సుమోటోగా విచారణ
గుజరాత్ హైకోర్టు ఆదేశాలు
అహ్మదాబాద్: ఇంట్లో టాయిలెట్ సీటుపై కూర్చొని న్యాయస్థానంలో జరిగిన విచారణకు వర్చువల్‌గా హాజరైన వ్యక్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ ఆరోపణల కింద ఆ ప్రబుద్ధుడిపై సుమోటోగా విచారణ ప్రారంభించింది. జూన్ 20వ తేదీన కోర్టులో జస్టిస్ నిర్జర్ ఎస్.దేశాయ్ ఓ కేసులో విచారణ చేపట్టారు. ఇందులో కక్షిదారుగా ఉన్న ఓ వ్యక్తి పసుపు రంగు టి–షర్టు ధరించి ఇంటి నుంచే వర్చువల్‌గా హాజరయ్యాడు. కానీ, టాయిలెట్ సీటుపై కూర్చొని మాట్లాడాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తిని సూరత్ జిల్లాలోని కిమ్ గ్రామానికి చెందిన అబ్దుల్ సమద్‌గా గుర్తించారు. అతడి ప్రవర్తనపై జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్‌టీ వచానీతో కూడిన డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. వీడియోలో అభ్యంతరకరంగా కనిపించిన అబ్దుల్ సమద్‌పై సుమోటోగా విచారణ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఎందుకు విచారణ జరిపి శిక్షించకూడదో ప్రశి్నస్తూ అతడికి నోటీసు జారీ చేయాలని పేర్కొంది. ఈ ఉత్తర్వును తాజాగా హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అబ్దుల్ సమద్ ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. సంబంధిత వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టంచేసింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి లాయర్లు, కక్షిదారులు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు గుజరాత్ హైకోర్టు అనుమతి ఇస్తోంది. అంతేకాకుండా హైకోర్టులో జరిగే విచారణను కోర్టు యూట్యూబ్ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు.