
ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణలు ప్రతి రంగానికి ఊతం అందిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఆయన పలు అంశాలను వివరించారు. ‘‘జీఎస్టీ బచత్ ఉత్సవ్"ను ప్రశంసిస్తూ.. తగ్గిన జీఎస్టీ రేట్లు పేదలకు, మధ్య తరగతికి గొప్ప ఉపశమనం కలిగిస్తాయని.. వ్యాపారాలు మరింత సులభతరమవుతాయని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని లేఖలో ఆయన పిలుపునిచ్చారు.
వ్యాపారులందరూ భారత్‌లో తయారు చేసిన’ ఉత్పత్తులను విక్రయించాలన్న ప్రధాని మోదీ.. ‘‘మనం గర్వంగా చెప్పుకుందాం.. మనం కొనేది స్వదేశీ, మనం అమ్మేది స్వదేశీ’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘‘దేశం నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా మీ కుటుంబాలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
..ఈ పండుగ మరింత సంతోషాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్కరణలు పొదుపును పెంచుతాయి. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి, వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు వంటి సమాజంలోని ప్రతి వర్గానికి నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి మరింత అభివృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి మన దేశ ప్రగతిని వేగవంతం చేస్తాయి’’ అని లేఖలో ప్రధాని మోదీ రాసుకొచ్చారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలలో అత్యంత ముఖ్యమైన మార్పు 5 శాతం, 18 శాతం రెండు ప్రధాన శ్లాబ్‌లు మాత్రమే ఉంటాయి.
..ఆహారం, మందులు, సబ్బులు, టూత్‌పేస్ట్, ఇన్సూరెన్స్ వంటి నిత్యావసర వస్తువులు ఇకపై పన్ను రహితంగా లేదా అత్యల్పమైన 5 శాతం పన్ను శ్లాబ్‌లో ఉంటాయి. ఇదివరకు 12 శాతం పన్ను ఉన్న వస్తువులు దాదాపు పూర్తిగా 5 శాతం శ్లాబ్‌లోకి మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా పేదరికం నుండి బయటపడి మధ్యతరగతి వర్గంగా మారిన 25 కోట్ల మందికి ఈ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయి. ఆదాయపు పన్ను తగ్గింపులు, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు కలిపితే ప్రజలకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల పొదుపు లభిస్తుంది’’ అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.
This festive season, let's celebrate the 'GST Bachat Utsav'! Lower GST rates mean more savings for every household and greater ease for businesses. pic.twitter.com/QOUGWXrC3d
— Narendra Modi (@narendramodi) September 22, 2025
2017లో ప్రారంభమైన జీఎస్టీ ప్రయాణం దేశాన్ని ఆర్థికంగా ఏకం చేసిందని మోదీ చెప్పారు. ఒక దేశం, ఒక పన్ను" విధానం ఏకరూపతను, ఉపశమనాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త సంస్కరణలు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేయడానికి దోహదం చేస్తాయి. దేశంలో నూతన GST సంస్కరణలు అమలులోకి రావడంతో తగ్గిన జీఎస్టీ రేట్లు 375 వస్తువులపై వర్తిస్తాయి. ఆటోమొబైల్స్ నుంచి రోజువారీ వినియోగ వస్తువుల వరకు ఈ జీఎస్టీ తగ్గింపు జరిగింది’’ ప్రధాని మోదీ లేఖలో వివరించారు.