
నగదు ఆధారిత గేమ్స్‌పై నిషేధం
మూడేళ్ల జైలు, రూ.కోటి జరిమానా
ప్రచారం చేసిన వారికి రెండేళ్ల జైలు
రూ.50 లక్షల జరిమానా కూడా
గేమింగ్ ప్లాట్‌ఫాంల నియంత్రణ
కీలక బిల్లుకు కేంద్రం ఆమోదం
ప్రజారోగ్యం దృష్ట్యా నిర్ణయం
ఇ–స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌కు ప్రోత్సాహం
నేడు పార్లమెంటు ముందుకు బిల్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్‌కు నూకలు చెల్లాయి. నెటిజన్లను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనం చేస్తున్న ఈ భూతానికి సమాధి కట్టే దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్‌ఫాంలపై అతి త్వరలో నిషేధం విధించనుంది. ఈ మేరకు ఆన్‌లైన్ ప్రమోషన్, నియంత్రణకు ఉద్దేశించిన ‘రెగ్యులేషన్, ప్రమోషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్’బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆన్‌లైన్ గేమ్ యూజర్లు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ముఖ్యంగా యూజర్లకు నగదు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్న గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం చట్టబద్ధమైన ని యంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒక ఆన్‌లైన్ గేమింగ్ నగదు బెట్టింగ్ పరిధిలోకి వస్తుందా, రాదా అన్నది తేల్చే పూర్తి అధికారాలు దానికి కట్టబెట్టనున్నారు.
‘‘దేశా న్ని పట్టి పీడిస్తున్న నగదు అక్రమ చెలామణీ (మనీ లాండరింగ్), అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ క్రైమ్ వంటి పలు జాఢ్యాలకు ఈ ఆన్‌లైన్ నగదు బెట్టింగ్‌లు ఊతమిస్తున్నట్టు తేలిన నేపథ్యంలో కఠిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లును బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘ఆన్‌లైన్ బెట్టింగులు పౌరులకు పూడ్చుకోలేని ఆర్థిక నష్టం మిగులుస్తున్నాయి. డిప్రెషన్ల వంటి మానసిక సమస్యలకు లోనై చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు’’అని గుర్తు చేశాయి.
బిల్లులోని కీలకాంశాలు...
⇒ రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.కోటి దాకా జరిమానా. పదేపదే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది.
⇒ వాటిని ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా
⇒ ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం
⇒ ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాంలకు వాణిజ్య ప్రకటనలను కూడా పూర్తిగా నిషేధిస్తారు
⇒ నమోదు కాని, అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపుతారు
⇒ ఇ–స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి నైపుణ్యాధారిత ఆన్‌లైన్ గేమ్స్ తదితరాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తారు
⇒ ఇలాంటి గేమ్స్ ఆడేవారిని మాత్రం శిక్షల పరిధి నుంచి తప్పించారు. వారిని బాధితులుగా పరిగణించాలని నిర్ణయించారు.
మంత్రివర్గం ఇతర నిర్ణయాలు
రూ.8,307 కోట్లతో ఆరు వరుసల భువనేశ్వర్ బైపాస్ ప్రాజెక్టుకు, రూ. 1,507 కోట్లతో రాజస్తాన్‌లోని కోటా–బుండీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి పరిశ్రమకు, వర్తక, విద్యా రంగాలకు ఎంతగా నో ప్రోత్సాహమివ్వడంతో పాటు ఇతోధికంగా ఉపాధి కలి్పంచే చర్యలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు.
ఇప్పటికే పలు చర్యలు
జూదంగా మారిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేంబ్లింగ్ ప్లాట్‌ఫాంలను నిషేధించేందుకు మోదీ సర్కారు కొన్నేళ్లుగా కీలక చర్యలు తీసుకుంటూ వస్తోంది...
⇒ 2022–2025 జూన్ నడుమ ఇలాంటి 1,524 ప్లాట్‌ఫాంలను నిషేధించింది.
⇒ ప్రస్తుతం ఐటీ చట్టం, 2000, ఐజీఎస్టీ చట్టం ప్రకారం నమోదు కాని, విదేశీ, చట్టాలను ఉల్లంఘించే ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫాంలను నిషేధించేలా మధ్యవర్తి సంస్థలకు సూచించే అధికారం జీఎస్టీ నిఘా విభాగం డీజీ చేతిలో ఉంది.
⇒ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సప్లయర్లను ఐజీఎస్టీ చట్టం ప్రకారం కేంద్రం నియంత్రిస్తోంది.
⇒ ఇలాంటి గేమింగ్ ప్లాట్‌ఫాంలను 2023లో 28 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు.
⇒ వీటిద్వారా గెలుచుకునే నగదు మొత్తాలపై ఆదాయ పన్నును 2025 ఆర్థిక సంవత్సరం నుంచి 30 శాతానికి పెంచారు.
⇒ విదేశీ గేమింగ్ ఆపరేటర్లను కూడా భారత చట్టాల పరిధిలోకి తెచ్చారు.
⇒ 2023 నుంచి అమల్లోకి వచ్చిన భారత న్యాయసంహిత ప్రకారం అనధికారిక బెట్టింగ్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీనికి ఏడేళ్ల దాకా జైలుశిక్షతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు.