
వాహనాలపై కులం ఆధారిత స్టిక్కర్లు, నినాదాలుంటే చలాన్లు
వీధులు, గ్రామాలు, పట్టణాల్లో కులం ప్రాతిపదికన బోర్డులు ఏర్పాటు చేయరాదు
హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులకు యూపీ ప్రభుత్వం ఆదేశాలు
లక్నో: పోలీసు రికార్డుల్లో కుల ప్రస్తావన అభ్యంతరకర పరిణామాలకు దారి తీస్తోందంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. పోలీసు రికార్డులతోపాటు పబ్లిక్ నోటీసుల్లో ఎటువంటి కుల ప్రస్తావన ఉండరాదని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాలపై కులం ఆధారితంగా స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించరాదని కూడా తెలిపింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు, జిల్లా యంత్రాంగాలకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కులపరమైన వివక్షను తొలగించాలంటూ ఈ నెల 16వ తేదీన హైకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఈ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసు రిజిస్టర్లు, కేస్ మెమోలు, అరెస్ట్ డాక్యుమెంట్లతోపాటు పోలీస్ స్టేషన్లలో పెట్టే నోటీస్ బోర్డుల్లోనూ కుల ప్రస్తావన ఉండరాదని చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ ఆ ఉత్తర్వులో తెలిపారు.
రాష్ట్ర క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్‌ఎస్) పోర్టల్‌లోనూ కులానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలన్నారు. పోలీసు రికార్డుల్లో నిందితుల పేర్ల వద్ద తల్లిదండ్రుల ఇద్దరి పేర్లను జత చేయాలన్నారు. వాహనాలపై కులానికి సంబంధించిన స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించే వారిపై చలాన్లు విధించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఏర్పాటు చేసే బోర్డులను తొలగించాలన్నారు.
ఈ వీధి లేదా ఈ ప్రాంతం ఫలానా కులానికి చెందినదంటూ బోర్డులను ఏర్పాటు చేయరాదన్నారు. రాజకీయ లాభాపేక్షతో కులం పేరుతో ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయరాదన్నారు. కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌పైనా నిఘా ఉంచుతామన్నారు. కులాధారిత శత్రుత్వాన్ని ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు లోబడి పై ఆదేశాలకు అనుగుణంగా అధికారులు తక్షణమే స్పందించాలని, దిగువ స్థాయి అధికారులకు ఈ విషయంలో తగు శిక్షణను కూడా ఇవ్వాలని పేర్కొన్నారు.