ఢిల్లీ సీఎంపై బీజేపీ ఎంపీ గంభీర్‌ ఘాటు వ్యాఖ్యలు

Gautam Gambhir Calls Delhi CM 21st Century Tughlaq - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీద నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద విమర్శల వర్షం కురిపించారు. ఓ వీడియోను ట్వీట్‌ చేసిన గంభీర్‌ ఢిల్లీ సీఎంని తుగ్లక్‌తో పోల్చారు. ఈ వీడియోలో 10-15 మంది ప్రయాణికులతో ఉన్న ఓ ఒంటెద్దు బండి వాన నీటితో నిండిన వీధులగుండా ప్రయాణం చేస్తోంది. కొద్ది దూరం వెళ్లగానే బ్యాలెన్స్‌ తప్పి ప్రయాణికులు పడిపోతారు. కిందపడ్డవారిని వదిలేసి బండి వెళ్లి పోతుంది. ఈ సంఘటనను ఉద్దేశించి గంభీర్‌.. ‘ఇది 14వ శతాబ్దంలో తుగ్లక్‌ పాలించిన ఢిల్లీ కాదు.. 21వ శతాబ్దపు తుగ్లక్‌ పాలన ఇది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో​ నిలిచిపోతుంది’)

గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని జకీరాలో ఓ బస్సు, ఆటో, కారు నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రయాణికులు కారు, ఆటోను బయటకు లాగడంలో విజయం సాధించారు కానీ బస్సును బయటకు తీసుకురాలేకపోయారు. ఇదిలా ఉండగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్టాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. పాలమ్ అబ్జర్వేటరీలో గురువారం తెల్లవారుజామున 5:30గంటల వరకు 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top