
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తరహాలోనే
చర్చనీయంగా సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి వ్యాఖ్యలు
సాక్షి,కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీలను ప్రకటించడంతో జనం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్దరామయ్య శక్తియోజన కింద మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. మూడేళ్లుగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పురుషులు తాము కూడా ఓటు వేశామని, తామేం పాపం చేశామని చర్చించుకుంటున్న తరుణంలో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై అధిక టికెట్ ధరలను విధించినట్లు కూడా విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
అభివృద్ధి పనులు అటకెక్కించారని విమర్శలు
ప్రజాకర్షక హామీలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్యారెంటీలను రద్దు చేస్తే అభివృద్ధి చేయవచ్చని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ నిధి, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.2000 ఇచ్చేందుకు దాదాపు రూ.50 వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతోంది.
బాంబు పేల్చిన బసవరాజ రాయరెడ్డి
ఈ తరుణంలో సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. సోమవారం కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లుగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సమాలోచన చేస్తోందన్నారు. ఈ విషయంలో సాధక బాధకాలను పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రభుత్వంలో నిధుల కొరత లేదని, గ్యారెంటీలను చక్కగా అమలు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళలకు రూ.2 వేలు, ఉచిత బస్సు తదితర గ్యారెంటీల ద్వారా ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే చర్యలు తీసుకుంటుందని వివరించారు.