
న్యూఢిల్లీ: ఆగస్టు 9, శనివారం.. భారతదేశం అంతటా రక్షా బంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు, బాలికలు తమ సోదరులకు ఆనందంగా రాఖీలు కట్టి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రాఖీని మరింత వేడుకగా చేసుకునేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించాయి.
రాఖీ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మహిళలకు ఒక రోజు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మగువల కోసం ఫ్రీ బస్సులను నడుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆగస్టు 9న రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారు. కాగా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే మహిళలకు ఏడాది పొడవునా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 8న ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు మహిళలకు యూపీఎస్‌ఆర్‌టీసీ, సిటీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు. పండుగ రద్దీని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. మహిళలు, పిల్లలకు హర్యానా ప్రభుత్వం ఆగస్టు 8 మధ్యాహ్నం నుండి ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించింది. ఢిల్లీ, చండీగఢ్‌లకు వెళ్లే అంతర్-రాష్ట్ర సర్వీసులలోనూ ఈ ఉచిత ప్రయాణం ఉంటుందని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆగస్టు 9, 10 తేదీల్లో రాష్ట్ర బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రక్షా బంధన్ రోజున రాజస్థాన్ ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్‌లలో ఆగస్టు 9న మహిళలకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మహిళలకు, పిల్లలకు రక్షాబంధన్ రోజున ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.