రాంచీ: జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని చాయ్‌బాసాలో స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి హెచ్‌ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని విచారణకు పంపింది. శనివారం జరిగిన విచారణలో అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలకు కూడా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి పెరిగింది.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా గుర్తించాం. లోపాలు సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఈ అవకతవకలను వివరించే నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించారు.
అనంతరం, జిల్లా సివిల్ సర్జన్ డా. సుశాంత్ కుమార్ మాఝీ ఈ అంశంపై మాట్లాడారు. ఇన్‌ఫెక్షన్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. అయితే, ఇన్‌ఫెక్షన్ రక్త మార్పిడి ద్వారా మాత్రమే వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, ఎందుకంటే కలుషితమైన సూదులు వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్‌ఐవీ సంక్రమించవచ్చని ఆయన తెలిపారు.
హైకోర్టు ఆగ్రహం..
ఈ ఘటనను జార్ఖండ్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుంచి ఈ విషయంపై నివేదిక కోరింది. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం, వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలందరిని గుర్తించి వారి రక్త నమూనాలను మళ్లీ పరీక్షించాలని ఆదేశించింది.
వ్యక్తిగత కక్ష కారణమా?
అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఈ ఘటన వెనుక వ్యక్తిగత విద్వేషం కారణంగా ఉన్నట్లు ఆరోపించారు. రక్త బ్యాంక్ సిబ్బందికి, బాధితుల్లో ఓ బాలుడి బంధువులో ఒకరికి మధ్య ఏడాదికాలంగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.


