అందరినీ వణికించిన బందిపోటు దొంగ గుర్జర్‌ మృతి.. జైల్లో.. | Feared dacoit Jagan Gurjar found dead in Ajmer jail | Sakshi
Sakshi News home page

అందరినీ వణికించిన బందిపోటు దొంగ గుర్జర్‌ మృతి.. జైల్లో..

Jun 29 2026 9:12 PM | Updated on Jun 29 2026 9:33 PM

Feared dacoit Jagan Gurjar found dead in Ajmer jail

రాజస్థాన్‌లో అత్యంత భద్రత ఉండే అజ్మేర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న చంబల్‌కు చెందిన కరుడుగట్టిన బందిపోటు ముఠా నాయకుడు జగన్‌ గుర్జర్‌ సోమవారం తన బ్యారక్‌లో విగతజీవిగా కనిపించాడు. ఇది హత్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతి విషయాన్ని పోలీసు సూపరింటెండెంట్‌ హర్షవర్ధన్‌ అగ్రవాల్‌ ధ్రువీకరిస్తూ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

జైలు నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖైదీలు తమ బ్యారక్‌లలోనే బంధించి ఉంటారని పోలీసులు తెలిపారు. బ్యారక్‌లు తెరిచిన తర్వాత సాధారణ తనిఖీల్లో జైలు సిబ్బంది గుర్జర్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఆ సమయంలో అతనితో ఒకే బ్యారక్‌లో ఉన్న ఖైదీ కూడా అక్కడే ఉన్నాడు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందం జైలుకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించి, ఆధారాలను సేకరించింది.

గుర్జర్‌ మృతికి దారితీసిన పరిస్థితులు, హత్యకు కారణం, ఘటన జరిగిన తీరు వంటి అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్జర్‌తో కలిసి అదే బ్యారక్‌లో భరత్‌పూర్‌కు చెందిన కుల్దీప్‌ జఘీనా సంచలన హత్య కేసు నిందితుడు విష్ణు ఉన్నాడని అధికారులు తెలిపారు. విష్ణును దర్యాప్తు అధికారులు విచారించారు.

జగన్‌ గుర్జర్‌ ఎవరు?
జగన్‌ గుర్జర్‌ చంబల్‌ ప్రాంతంలో అత్యంత భయంకరమైన దొంగల ముఠా నాయకుల్లో ఒకడు. ధోల్‌పూర్‌ డాంగ్‌ ప్రాంతంలోని లోయల్లో ఎన్నో ఏళ్ల పాటు తన ప్రభావాన్ని కొనసాగించాడు. హత్య, దోపిడీ, దొంగతనం, వసూళ్లు, అపహరణ, ఆయుధాల చట్టం కింద నమోదైన నేరాలు సహా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో అతనిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

గుర్జర్‌ రిజర్వేషన్‌ ఉద్యమం సమయంలో 2008లో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు చెందిన ధోల్‌పూర్‌ ప్యాలెస్‌ను పేల్చివేస్తానని జగన్‌ గుర్జర్‌ బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో అతడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. ఎన్నో ఏళ్ల పాటు పరారీలో ఉన్న గుర్జర్‌ 2018 ఆగస్టు 19న బయానాలో అప్పటి భరత్‌పూర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మాలిని అగ్రవాల్‌ ఎదుట లొంగిపోయాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement