
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకరంగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోరాటానికి మైనర్ రెజ్లర్ తండ్రి రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఆయన వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు, అది తప్పుడు ఫిర్యాదని ఆ మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలపడంతో ఒక్కాసారిగా అంతా అవాక్కయ్యారు.
ప్రస్తుతం మీరు ఇలా ఎందుకు మాట మారుస్తున్నారని విలేకరులు ఆయనను అడగగా.. ‘ఈ నిజం న్యాయస్థానం ద్వారా బయటకు రావడం కంటే ఇప్పుడు ఈ రకంగా బయటకు రావడమే మేలు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై వివరణగా.. 2022లో అండర్-17 చాంపియన్‌షిప్ ట్రయల్స్ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే కేవలం ఒక మ్యాచ్‌లో ఓటమికి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. మీకు అది ఒక్క పోటీనే కావచ్చని, కానీ అది తన కూతురుకు ఏడాది శ్రమకు ఫలితమని చెప్పారు. అంతేకాకుండా తన కూతురు ఓడిపోయిన అండర్-17 చాంపియన్‌షిప్ ట్రయల్స్‌పై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని అధికారులు నాకు హమీ ఇచ్చారని, అందుకు ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.