వందోరోజుకు రైతు ఆందోళనలు

Farmers protesting agri laws block KMP expressway in Haryana - Sakshi

4 గంటల పాటు కేఎంపీ హైవేపై రాకపోకలను అడ్డుకున్న రైతులు

చండీగఢ్‌: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో రైతు సంఘాలు కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. శనివారం 11 గంటల నుంచి 4 గంటల వరకు హరియాణాలో పలు ప్రాంతాల్లో హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాస్తారోకో సందర్భంగా ఈ హైవేపై రాకపోకలను నియంత్రించిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. సంయుక్త కిసాన్‌మోర్చా ఈ రాస్తారోకోకు పిలుపునిచ్చింది. మూడు చట్టాలను ఉపసంహరించుకునేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు చెప్పారు. తమ నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు.  

కేంద్ర అహంకారానికి నిదర్శనం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన వందోరోజుకు చేరడం కేంద్ర దురహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. భారత ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా అభివర్ణించింది.
ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది పిల్లలు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని, అలాంటి రైతులను అడ్డుకునేందుకు కేంద్రం రోడ్లపై మేకులు పరుస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ విమర్శించారు. రైతులు తమ హక్కులను కోరుతున్నారని, ప్రభుత్వం వారిపై దమనకాండ జరుపుతోందని ట్వీట్‌ చేశారు. అన్నదాతలు వందరోజులుగా నిరసన చేస్తున్నా, బీజేపీ ప్రభుత్వం అబద్దాలు, అహంకారంతో కాలం గడిపిందని ప్రియాంకా గాంధీ  పేర్కొన్నారు.

రైతాంగ ఉద్యమం చరిత్రాత్మకం
సాక్షి , న్యూఢిల్లీ: సాగు వ్యతిరేక చట్టాలపై  వంద రోజులుగా సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైందని ఆలిండియా కిసాన్‌ సభ, సంయుక్త కిసాన్‌ మోర్చా అభివర్ణించాయి.  శనివారం ఈ రెండు రైతు సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి ఉద్యమం మాదిరిగా రైతు ఉద్యమం జరుగుతోందని స్పష్టంచేశాయి. రైతులు చేస్తున్న పోరాటం సామాన్యమైన విషయం కాదని, ఎన్నో ఇబ్బందులు, అటంకాలు, అవమానాలకి ఓర్చి ఇంత స్థాయిలో ఉద్యమిస్తున్న రైతాంగానికి ఏఐకేఎస్, ఎస్‌కేయూ ధన్యవాదాలు తెలిపాయి.  బీజేపీ  సర్కారు ఎన్నినిర్బంధాలు పెట్టినా రైతాంగం  ఉద్యమించడం హర్షణీయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top