మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వెలుపల ఆందోళన చేస్తున్న పొగాకు రైతులు
టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన
తక్షణమే పెంచిన ఎక్సైజ్ సుంకం తగ్గించాలంటూ డిమాండ్
70 శాతం ఎక్సైజ్ సుంకం పెంపుతో పరిశ్రమ కుదేలు
ఇప్పటికే మార్కెట్ అనిశ్చితితో ధర లేక నష్టపోయిన రైతులు
పన్నుల ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నినాదాలు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పొగాకు రైతులు భగ్గుమన్నారు. సిగరెట్లపై 70 శాతానికిపైగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే ఉపసంహరింపచేయాలని ఆందోళన చేశారు. నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 400 మందికిపైగా పొగాకు రైతులు తరలివచ్చి కార్యాలయం బయట ఆందోళన చేశారు. కేంద్రం తీసుకున్న పెంచిన సుంకాలను తక్షణమే ఉపసంహరింప చేయకపోతే పొగాకు రైతులతోపాటు పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన చెందారు.
ఈ సందర్భంగా పొగాకు సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారు. ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల పరిశ్రమకు కలిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల ధర లేక ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెంచిన ఎక్సైజ్ సుంకం ప్రభావం వలన పొగాకు మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. మార్కెటింగ్ సీజన్‌కు ముందే ఈ ప్రభావం క్షేత్ర స్థాయిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడం వలన అక్రమ సిగరెట్ల వ్యాపారం, అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు.
పన్నులు చెల్లించని, నియంత్రించని ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించడమే కాక, నాసిరకం ఉత్పత్తుల కారణంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. సుంకం పెంపు వల్ల ఎఫ్‌సీవీ పొగాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆంధ్రప్రదేశ్‌కు అపార నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం సుంకం పెంపును వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు ప్రతినిధులు చంద్రబాబును డిమాండ్ చేశారు. అనంతరం పొగాకు రైతులు మీడియాతో మాట్లాడుతూ సీఎం సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు.


