
బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి వేల కోట్ల పోంజీ స్కామ్‌కు పాల్పడిన సంస్థ సీఈవోని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ గ్రూప్ సీఈవో ఫాల్కన్ గ్రూప్ సీవోఓ ఆర్యన్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా పోలీసులు తెలంగాణకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఫాల్కన్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐడీ చీఫ్ చారు సిన్హా తెలిపారు.
ఫాల్కన్ గ్రూప్ అసలు పేరు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరిట దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించింది. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పి వేలకోట్లు వసూలు చేశారు. ఈ సంస్థ మోసం వెలుగులోకి రావడంతో ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్‌దీప్ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసి దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. ఆపరేషనల్ హెడ్ సందీప్ కుమార్‌ను ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.5 కోట్ల విలువైన కార్లు, 14 స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇతర నిందితులు పవన్, కావ్య, రవికుమార్ తదితరులు పరారీలో ఉన్నారు.
పోలీసుల వివరాల మేరకు ఫాల్కన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ .. ఎంఎన్‌సీ కంపెనీలలో పెట్టుబడుల పేరుతో డిపాజిట్లు స్వీకరించారు. మొత్తం 7,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వసూలు చేసిన డబ్బును 14 కంపెనీల్లో పెట్టుబడులుగా మార్చారు. కొంతమందికి రూ.850 కోట్లు తిరిగి చెల్లించినా, ఇంకా అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కేసును తెలంగాణ సీఐడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తున్నాయి.