
ఐఎస్‌ఎస్‌లో పలు దేశాల రుచులు ఆస్వాదిస్తున్నా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వెల్లడి
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో వారం రోజులు పూర్తి చేసుకున్నారు. సహచర వ్యోమగాములతో కలిసి ఇప్పటికే భూమిని 113 సార్లు చుట్టేశారు. 40.66 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 12 రెట్ల దూరంతో సమానం. ఐఎస్‌ఎస్‌లో తన అనుభవాన్ని శుభాంశు శుక్లా శుక్రవారం పంచుకున్నారు.
మన భారతీయ ఆమ్ రస్, గాజర్‌కా హల్వా, మూంగ్‌దాల్ హల్వా రుచులు ఆస్వాదిస్తున్నానని, వాటిని సహచరులతో పంచుకుంటున్నానని చెప్పారు. ఇతర దేశాల వంటకాలను సైతం రుచి చూస్తున్నానని తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఐఎస్‌ఎస్ నుంచి సంభాషించారు. అలాగే హామ్ రేడియో ద్వారా బెంగళూరులోని యూఆర్‌ఎస్సీ సైంటిస్టులతో మాట్లాడారు. ఇక్కడంతా అద్భుతంగా ఉందని, తామంతా చక్కగా కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు.
వేర్వేరు దేశాలకు చెందిన ఆహార పదార్థాలను ఒకరికొకరం పంచుకుంటున్నామని వెల్లడించారు. వేర్వేరు దేశాల వ్యక్తులతో కలిసి పని చేయడం ఉత్సాహకరమైన అనుభవమని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూగోళాన్ని కళ్లారా వీక్షించడం మాటల్లో చెప్పలేని అద్భుత అనుభూతిని ఇస్తోందని వివరించారు. అత్యంత ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1984లో రాకేశ్ శర్మ ఏడు రోజుల 21 గంటల 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. శుభాంశు శుక్లా ఆ రికార్డును అధిగమించారు.