పట్టుబడ్డ హైటెక్‌ కాపీయింగ్‌ | Electronic Devices Seized During Exams in Dehradun | Sakshi
Sakshi News home page

పట్టుబడ్డ హైటెక్‌ కాపీయింగ్‌

May 23 2025 1:23 AM | Updated on May 23 2025 1:23 AM

Electronic Devices Seized During Exams in Dehradun

పరీక్ష అరుణాచల్‌ ప్రదేశ్‌లో.. సమాధానాలు హరియాణా నుంచి

53 మంది అభ్యర్థుల అరెస్ట్‌..

సిమ్లా: మోసగాళ్ల అతి తెలివితేటలు మామూలుగా లేవు. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే ఉద్యోగ ఎంపిక పరీక్షలకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హరియాణా నుంచి సమాధానాలందించే ముఠా గుట్టు రట్టయింది. పరీక్ష రాసే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా అమర్చుకున్న ఎల్రక్టానిక్‌ పరికరాలతో హరియాణాలోని జింద్‌లోని ముఠా జవాబులు అందించినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ రాకెట్‌ను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఏం జరిగిందంటే.. అరుణాచల్‌లోని నవోదయ విద్యాలయ సమితిలోని బోధనేతర పోస్టుల భర్తీకి సీబీఎస్‌ఈ ఈ నెల 18న ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు ఇటానగర్‌లోని వీకేవీ చింపు, కింగ్‌కప్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రాల్లో ఆ రోజు సాయంత్రం ల్యాబ్‌ అటెండెంట్‌ పరీక్ష జరిగింది. కింగ్‌కప్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పరీక్ష రాసే ఓ అభ్యర్థి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు, పోలీసులు సోదాలు చేపట్టారు. 

తనిఖీల్లో ఆ విద్యార్థి వద్ద ఓ చిన్న ఎల్రక్టానిక్‌ పరికరం, అతి చిన్న మైక్రోఫోన్‌ దొరికాయి. ఈ పరీక్ష కేంద్రంలో సరిగ్గా ఇలాంటి ఉపకరణాలనే ధరించిన మొత్తం 23 మంది విద్యార్థులను పట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరో విద్యార్థి పట్టుబడ్డాడు. ఇలాంటి సోదాల్లో మిగతా వాళ్లు బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆరా తీయగా ఉదయం పరీక్ష రాసిన వారివద్ద కూడా ఇలాంటి ఉపకరణాలున్నట్లు తేలింది. దీంతో, వారిని కూడా పట్టుకున్నామని ఎస్‌పీ రోహిత్‌ రాజ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. వీరందరినీ సమీప హోటళ్లు, ఇళ్లలోనే అరెస్ట్‌ చేశామన్నారు. 

‘ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌తో మోసపూరితంగా పరీక్ష రాస్తున్న మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకుని, 29 డివైజెస్‌ను స్వాదీనం చేసుకున్నాం వీరిలో చాలా మంది నేరాన్ని అంగీకరించారు’అని ఎస్‌పీ వివరించారు. ‘పరీక్ష రాసేందుకు సాయం చేస్తామంటూ ఓ ముఠా తమను నమ్మించిందని వీరు చెప్పారు. నిఘా నుంచి తప్పించుకునేందుకు ఎగ్జామ్‌ హాల్స్‌లో మారుమూల ప్రాంతాల్లో కూర్చోవాలని సూచనలు ఇచ్చారు. ఈ మేరకు ఎల్రక్టానిక్‌ పరికరాలను ఉపయోగించే తీరుపై వీరందరికీ ముఠా శిక్షణ ఇచ్చింది’అని ఎస్‌పీ తెలిపారు. 

దీని ప్రకారం అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను అండర్‌ వేర్‌లో దాచుకున్నారు. అతిచిన్న ఇయర్‌ ఫోన్‌ను బయటకు కనిపించని రీతిలో చెవి లోపల అమర్చారు. ముందుగా వీరు తమకందించిన క్వశ్చన్‌ పేపర్‌ సెట్‌ పేరు ఏ, బీ, సీ, డీల్లో ఏదో అవతలి వారికి చెప్పాలి. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే వరకు ఎదురు చూడాలి. దగ్గితే సమాధానం అడిగినట్లు అర్ధం. అప్పుడు అవతలి వ్యక్తి సమాధానం చెప్తాడు’అని ఎస్‌పీ రాకెట్‌ వివరాలను వెల్లడించారు.

 మొత్తమ్మీద పరీక్ష పత్రం కూడా లీకై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్, సిక్కిం, దిమాపూర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లోనూ ఇలాంటి మతలబే జరిగినట్లు గుర్తించామన్నారు. ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోందని వివరించారు. పట్టుబడిన 53 మందిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరికి సాయం అందించిన వారిని, ముఠా సూత్రధారిని కనుక్కునేందుకు హరియాణా పోలీసుల సాయం కోరామని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement