breaking news
Dimapur
-
పట్టుబడ్డ హైటెక్ కాపీయింగ్
సిమ్లా: మోసగాళ్ల అతి తెలివితేటలు మామూలుగా లేవు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే ఉద్యోగ ఎంపిక పరీక్షలకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హరియాణా నుంచి సమాధానాలందించే ముఠా గుట్టు రట్టయింది. పరీక్ష రాసే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా అమర్చుకున్న ఎల్రక్టానిక్ పరికరాలతో హరియాణాలోని జింద్‌లోని ముఠా జవాబులు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఏం జరిగిందంటే.. అరుణాచల్‌లోని నవోదయ విద్యాలయ సమితిలోని బోధనేతర పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ ఈ నెల 18న ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు ఇటానగర్‌లోని వీకేవీ చింపు, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్ కేంద్రాల్లో ఆ రోజు సాయంత్రం ల్యాబ్ అటెండెంట్ పరీక్ష జరిగింది. కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాసే ఓ అభ్యర్థి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు, పోలీసులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో ఆ విద్యార్థి వద్ద ఓ చిన్న ఎల్రక్టానిక్ పరికరం, అతి చిన్న మైక్రోఫోన్ దొరికాయి. ఈ పరీక్ష కేంద్రంలో సరిగ్గా ఇలాంటి ఉపకరణాలనే ధరించిన మొత్తం 23 మంది విద్యార్థులను పట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరో విద్యార్థి పట్టుబడ్డాడు. ఇలాంటి సోదాల్లో మిగతా వాళ్లు బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆరా తీయగా ఉదయం పరీక్ష రాసిన వారివద్ద కూడా ఇలాంటి ఉపకరణాలున్నట్లు తేలింది. దీంతో, వారిని కూడా పట్టుకున్నామని ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. వీరందరినీ సమీప హోటళ్లు, ఇళ్లలోనే అరెస్ట్ చేశామన్నారు. ‘ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో మోసపూరితంగా పరీక్ష రాస్తున్న మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకుని, 29 డివైజెస్‌ను స్వాదీనం చేసుకున్నాం వీరిలో చాలా మంది నేరాన్ని అంగీకరించారు’అని ఎస్పీ వివరించారు. ‘పరీక్ష రాసేందుకు సాయం చేస్తామంటూ ఓ ముఠా తమను నమ్మించిందని వీరు చెప్పారు. నిఘా నుంచి తప్పించుకునేందుకు ఎగ్జామ్ హాల్స్‌లో మారుమూల ప్రాంతాల్లో కూర్చోవాలని సూచనలు ఇచ్చారు. ఈ మేరకు ఎల్రక్టానిక్ పరికరాలను ఉపయోగించే తీరుపై వీరందరికీ ముఠా శిక్షణ ఇచ్చింది’అని ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్‌ను అండర్ వేర్లో దాచుకున్నారు. అతిచిన్న ఇయర్ ఫోన్‌ను బయటకు కనిపించని రీతిలో చెవి లోపల అమర్చారు. ముందుగా వీరు తమకందించిన క్వశ్చన్ పేపర్ సెట్ పేరు ఏ, బీ, సీ, డీల్‌లో ఏదో అవతలి వారికి చెప్పాలి. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే వరకు ఎదురు చూడాలి. దగ్గితే సమాధానం అడిగినట్లు అర్ధం. అప్పుడు అవతలి వ్యక్తి సమాధానం చెప్తాడు’అని ఎస్పీ రాకెట్ వివరాలను వెల్లడించారు. మొత్తమ్మీద పరీక్ష పత్రం కూడా లీకై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్, సిక్కిం, దిమాపూర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లోనూ ఇలాంటి మతలబే జరిగినట్లు గుర్తించామన్నారు. ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోందని వివరించారు. పట్టుబడిన 53 మందిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరికి సాయం అందించిన వారిని, ముఠా సూత్రధారిని కనుక్కునేందుకు హరియాణా పోలీసుల సాయం కోరామని వివరించారు. -
దిమాపూర్ దారుణం
నాగాలాండ్ వ్యాపార రాజధానిగా పేరుబడిన దిమాపూర్‌లో జైలుపై ఏడెనిమిది వేలమంది గుంపు దాడిచేసి అత్యాచార కేసు నిందితుడిని రోడ్డుపై కొట్టి చంపిన తీరు అనేక అంశాలను చర్చలోకి తెచ్చింది. న్యాయస్థానాల్లో అత్యాచారం కేసుల విచారణ ఏళ్లతరబడి కొనసాగడం, కొన్ని సందర్భాల్లో నిందితులు నిర్దోషులుగా బయటికి రావడంచూస్తున్నవారికి అది సరైందేననిపించింది. బాధితులకు న్యాయం అందడంలో జాప్యం జరిగితే దిమాపూర్ ఉదంతం వంటివి అన్నిచోట్లా చోటు చేసు కునే ప్రమాదం ఉన్నదని కొందరు హెచ్చరించారు. అయితే ఆ సంఘటనలో ఇప్పు డిప్పుడే వెలుగులోకి వస్తున్న వాస్తవాలు కలవరపరుస్తున్నాయి. బహుశా అత్యాచారం కేసు నిందితుడు సయ్యద్ ఫరీద్ ఖాన్ ‘బయటినుంచి’ వచ్చిన వ్యక్తి కానట్టయితే అతనిపై దాడి జరిగి ఉండేది కాదు. ఎందుకంటే దాడికి ముందు అతని పుట్టుపూర్వోత్త రాలపై విపరీతంగా వదంతులు వ్యాపించాయి. అతను బంగ్లాదేశ్‌నుంచి అక్రమంగా జొరబడ్డాడని కాసేపు, అస్సాంనుంచి వచ్చినవాడని కాసేపు ప్రచారం సాగింది. చివకు వలసవచ్చినవారివల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయనేంత వరకూ వెళ్లింది. పర్యవసానంగా స్థానికేతరులందరిపైనా దాడులు జరిగాయి. అనేకులు ప్రాణ భయంతో దుకాణాలు, ఇళ్లు వదిలి పారిపోవాల్సివచ్చింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నా ప్రభుత్వ యంత్రాంగం గానీ, పోలీసులుగానీ పెద్దగా పట్టించుకోలేదు. మృతుడు అస్సాం పౌరుడని, అతని సోదరులు సైన్యంలో పనిచేస్తున్నారని చివరకు నిర్ధారణ అయింది. అతనిపై వచ్చిన అత్యాచారం ఆరోపణల్లోని నిజానిజాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. బాధితురాలిపై జరిగిన వైద్య పరీక్షలో అత్యాచారం జరగలేదని వెల్లడైందని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ప్రకటించివున్నారు. అలాంటిదేమైనా ఉన్నట్టయితే ఆ సంగతి చెప్పాల్సింది కేసు దర్యాప్తు చేస్తున్న నాగా లాండ్ పోలీసులు, అక్కడి అధికార యంత్రాంగమే తప్ప బయటివారు కాదు. అందులోనూ రాష్ట్రాలమధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండే ఈశాన్య ప్రాంతంలో ఇలాంటి ప్రకటనలకు అంత విలువ ఉండదు. పరిమిత వనరులుండి, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమవుతున్న ఈశాన్య భారతంలో ప్రతి రాష్ట్రమూ పేలడానికి సిద్ధంగా ఉండే మందుపాతరను తలపిస్తుంది. ఉపాధి నిమిత్తమో, వ్యాపారం నిమిత్తమో బయటినుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ తమ అవకాశాలను కొల్లగొట్టడానికి వచ్చిన ప్రమాదకారిగా పరిగణించడం అక్కడ సర్వ సాధారణంగా మారింది. వివిధ రాష్ట్రాలమధ్యా, జాతులమధ్యా తరచు చోటు చేసుకుంటున్న ఘర్షణల వెనకున్న ప్రధాన కారణం ఇదే. దశాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వంలోనివారూ ప్రేక్షక పాత్ర వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. 1963లో నాగాలాండ్ ఏర్పడిన నాటినుంచీ అస్సాం-నాగాలాండ్‌ల మధ్య ఉద్రిక్తతలున్నాయి. అవి ఒక్కో సారి కట్టుతప్పుతున్నాయి. పరస్పర దాడులు, హత్యలు, గృహదహనాలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. నిరుడు ఆగస్టులో అస్సాం-నాగాలాండ్ సరిహద్దుల్లో రెండు తెగలు ఘర్షణపడి దాదాపు 20మంది మరణించడం, వేలాదిమంది కొంపాగోడూ వదిలి వలసపోవడం ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు దాడిలో మరణించిన సయ్యద్ ఫరీద్‌ఖాన్ అస్సాంనుంచి వలసవచ్చిన వ్యక్తి కావడం మాత్రమే కాదు...అతను మైనారిటీ తెగకు చెందినవాడు కావడం అతని పాలిట శాపమైంది. దాడికి దిగిన గుంపు వాదన చిత్రమైనది. తమ తెగకు చెందిన మహిళపై ‘బయటి వ్యక్తి’ దాడి చేస్తాడా అన్నది వారి ప్రధాన వాదన. ఇటీవల బీబీసీ ‘నిర్భయ’పై నిర్మించిన డాక్యుమెంటరీ విషయంలోనూ ఇలాంటి వాదనే బయలుదేరింది. మన దేశంలో జరిగిన దురదృష్టకర ఘటనపై వేరే దేశానికి చెందిన ఎవరో డాక్యుమెంటరీ నిర్మించడమేమిటని కొందరు ప్రశ్నించారు. నాగాలాండ్‌లో దాడికి దిగినవారి వాదన కూడా ఇంచుమించు అలాంటిదే. ఈ ఉదంతంలో అధికార యంత్రాంగం తీరు కూడా ఆందోళన కలిగిస్తుంది. నిందితుడిపై వదంతులు వ్యాపిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. జనం గుమిగూడి జైలు వైపు దూసుకు వస్తున్నా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. పైగా జైల్లోకి ప్రవేశించాక ప్రతి సెల్ వద్దకూ వారిని తీసుకెళ్లి నిందితుణ్ణి గుర్తుపట్టేందుకు జైలు అధికారులు సహకరించారు. సమయానికి తమవద్ద తగినంత సంఖ్యలో సిబ్బంది లేకపోబట్టి ఇలా జరిగిందని అధికారులు ఇస్తున్న సంజాయిషీ నమ్మదగ్గది కాదు. రెండు రాష్ట్రాలమధ్యా ఉన్న శత్రుపూరిత వైఖరివల్లనే వారు సకాలంలో స్పందించకుండా ఉండిపోయారన్నది వాస్తవం. స్వయంపాలన కావాలని లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరేవారిది ప్రజా స్వామిక డిమాండ్. వలస దోపిడీనుంచి స్థానికులను రక్షించాలని, వారి ప్రయోజ నాలు కాపాడాలని అలాంటి ఉద్యమాలు కోరతాయి. అంతేతప్ప ఎక్కడినుంచో వచ్చాడన్న కారణంతో స్థానికులను కూడగట్టి హంతక దాడులకు దిగవు. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా వైషమ్యాలను కొందరు రెచ్చగొడుతున్నారు. వివిధ జాతులకు ప్రాతినిధ్యంవహిస్తున్నామని చెప్పుకునే మిలిటెంటు సంస్థలు అవతలి తెగలకు చెందిన పౌరులను అపహరించి చంపడం, గ్రామాలపైబడి దాడులు చేయడం, ఇళ్లు తగలబెట్టడం చేస్తున్నాయి. ఇప్పుడు అది జైళ్లపై దాడి చేసే స్థితికి చేరుకుంది. అన్నిటికన్నా కలవరపరిచే విషయం...ఈ దాడిలో మహిళలు, పిల్లలు పాల్గొనడం. సామాజిక అసమానతలు, అభివృద్ధి లేమి, నిరుద్యోగంవంటివి ఇప్పటికే ఈశాన్యప్రాంత సమాజాన్ని కావలసినంతగా అమానవీకరించాయి. వచ్చిన ఆరోపణ ఎంత తీవ్రమైనదైనా కావొచ్చుగానీ...ఒక వ్యక్తిని కొట్టి చంపడంలో మహిళలు, పిల్లలు సైతం భాగస్వాములయ్యారంటే తమ నిర్వాకం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నదో పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అక్కడి సమస్యల పరిష్కారానికి ఇకనుంచి అయినా చిత్తశుద్ధితో కృషి చేయాలి.