కరోనా సోకిన తల్లులు తమ పిల్లలకు పాలివ్వొచ్చా..?

DR Manju Puri Says Covid Positive Mother Can Breastfeed To Children - Sakshi

జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డకు కరోనా సోకదు

గైనకాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మంజు పురి

న్యూఢిల్లీ: కరోనా సోకిన తల్లులు తమ పిల్లలకు పాలివ్వొచ్చని, దాని వల్ల కరోనా సోకదని ఢిల్లీలోని లేడీ హార్దింగే మెడికల్‌ కాలేజీ గైనకాలజీ విభాగాధిపతి డా. మంజు పురి తెలిపారు. అయితే పాలిచ్చే సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో బిడ్డకు కనీసం 6 అడుగల దూరంలో ఉండాలని, తరచుగా శానిటైజ్‌ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ద్వారా ఆమె హెచ్చరించారు. పాలిచ్చే సమయంలో మాస్కు ధరించడం, ముఖానికి షీల్డ్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కరోనా సోకిన గర్భవతి ద్వారా కడుపులోని బిడ్డకు కరోనా సోకుతుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని, కానీ అందుకు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు.

గర్భంతో ఉన్నా వ్యాక్సిన్‌..
గర్భంతో ఉన్నవారు/బిడ్డకు జన్మనిచ్చిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సందేహించాల్సిన అవసరం లేదని డా. మంజు స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల పిల్లలు పుట్టబోరని, కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉందని సోషల్‌ మీడియాలో ఉన్న వార్తలు నిరాధారమని పేర్కొన్నారు. గర్భంతో ఉన్న వారు వ్యాక్సినేషన్‌ చేయించుకోవడం వల్ల తల్లి నుంచి బిడ్డకు కూడా కరోనా యాంటీబాడీలు అందుతాయని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ వల్ల ప్రత్యుత్పత్తి అవయవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. 

సొంతవైద్యం వద్దు..
గర్భంతో ఉన్నప్పుడు కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డా. మంజు పేర్కొన్నారు. ఒక వేళ కరోనా పాజిటివ్‌గా తేలితే సొంత వైద్యం జోలికి వెళ్లకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. నిత్యం ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలని అన్నారు. కరోనా సోకిన తల్లి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతాయని, అందువల్ల ముందునుంచే ఎక్కువ ఫ్లూయిడ్స్‌ను తీసుకుంటూ గడపాలని అన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరోనా సోకితే.. బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరూ లేకపోతే తల్లి మరింత జాగ్రత్తగా ఉండాలని   డా. మంజు తెలిపారు. 

మానసిక ఆరోగ్యం ముఖ్యం..
గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి శరీరంలో వచ్చే మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారని, అయితే కరోనా సోకిన వారు సాధ్యమైనంతగా అలాంటి ఒత్తిడికి దూరంగా ఉండాలని చెప్పారు. వారికి కుటుంబ సభ్యులు అండగా నిలవాలని, వీడియో కాల్స్‌ ద్వారా వారికి నిరంతరం అందుబాటులో ఉండాలని ఆమె తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top