
పుణె: ఉగ్రవాద మూకలను తన దేశంలోనే పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టే క్రమంలో భారత ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపే ప్రక్రియను ‘ ఇండియా కూటమి’ బాయ్ కాట్ చేయాలంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యాలపై శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ సంజయ్ రౌత్‌కు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందంటూనే బ్రెయిన్ వాష్ చేశారు శరద్ పవార్.
అంతర్జాతీయ అంశాలకు స్థానిక రాజకీయాలను జత చేయొద్దంటూ క్లాస్ పీకారు. ఇది జాతీయంగా పరిష్కరించుకునే అంశం కాదని, అంతర్జాతీయ సమస్యను ఎలా చూడాలో అలానే చూడాలంటూ హితవు పలికారు శరద్ పవార్. ఇక్కడ తాను గతంలో ఒక ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఉన్న సంగతిని శరద్ పవార్ గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
బరామతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఎప్పుడైనా అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించాల్సిన సమయంలో అంతా ఏకతాటిపై ఉండాలి. అంతేకానీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ చేయకూడదు. అంతర్జాతీయ వేదికపై భారత్ వాణి వినిపించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసింది.
పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ప్రపంచ దేశాలకు తెలిపే బాధ్యతను ఆయా ప్రజాప్రతినిధులపై ఉంచింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దేశాన్ని అప్పగిస్తూ వస్తోంది. భారత్ నినాదం ఒక్కటే.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనేది మనం చెప్పాల్సింది. పాకిస్తాన్ తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడమే మన ముందున్న లక్ష్యం. అటువంటి తరుణంలో దీనిని బాయ్ కాట్ చేద్దామంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికావు’ అంటూ శరద్ పవార్ క్లియర్ మెస్సేజ్ పంపారు.