
వైద్యాధికారి గది తలుపులు తెరచిన సమయంలో వెలుగులోకి
కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన వైద్యాధికారి
కర్ణాటక: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పాలనాధికారిగా ఉన్న డాక్టర్ వసంతకుమార్ గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి విదితమే. సోమవారం ఆయన ఉన్న కార్యాలయం గదిని సిబ్బంది తెరచిన సమయంలో గదిలో చేతబడి చేసిన గుర్తులు కనిపించి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు.
మాలూరు నగరంలోని ఆస్పత్రిలో డాక్టర్ వసంతకుమార్ కంటి వైద్య నిపుణులుగా గత 10 సంవత్సరాలుగా పని చేసి అనంతరం ఆస్పత్రి వైద్యాధికారిగా నియమితులయ్యారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత నెల 5వ తేదీన బెంగళూరు నుంచి రైలులో మాలూరుకు వస్తుండగా తీవ్ర గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించారు.
సోమవారం ఉదయం ఆస్పత్రిలోని ఆయన గదిని తెరచిన సమయంలో చేతబడి చేసిన విషయం వెలుగు చూసింది. గదిలో మరణించిన రెండు గబ్బిలాలు, బీరువాలో చేతబడికి ఉపయోగించిన బొమ్మలు కనిపించాయి. విషయాన్ని వసంతకుమార్ కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వైద్యుడు వసంతకుమార్ గుండెపోటుతో మరణించడానికి చేతబడికి ఏదైనా సంబంధం ఉందా? చేతబడి ఎవరు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు.