
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్‌గీర్‌లో ఉంటున్న దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్(28) కాలిన గాయాలతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.
అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.
బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే.. మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె తలుపులు తెరిచింది. దినేష్ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.
ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.