ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం! | Delhi Malviya Nagar Restaurant Fire Accident News Updates | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!

Jun 3 2026 12:11 PM | Updated on Jun 3 2026 2:28 PM

Delhi Malviya Nagar Restaurant Fire Accident News Updates

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్‌లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

హౌజ్‌రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్‌ రెస్టారెంట్‌లో ఉదయం 8గం.50ని సమయంలో  అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్‌లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. 

మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్‌ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్‌లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్‌ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన 
మాలవీయ నగర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement