ఫోన్‌లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం! | Delhi Cafe Owner Punit Khurana Incident Just Like Atul Subash Case, Check Shocking Details Inside | Sakshi
Sakshi News home page

#JusticIsDue: ఫోన్‌లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!

Jan 1 2025 3:32 PM | Updated on Jan 1 2025 4:15 PM

Delhi Cafe Owner Punit Khurana Incident Just Like Atul Subash Case Full Details

కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం. కానీ, అతుల్‌ సుభాష్‌ అనే  భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసులు.. వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విచారణే కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.  ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఓ అతుల్‌.. కర్ణాటకలో ఓ కానిస్టేబుల్‌ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌  .. ఇలా రోజుకొక ఉదంతం ఈ చర్చలో భాగమవుతోంది. ఇదిలా ఉండగానే.. ఢిల్లీలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.

వుడ్‌బాక్స్‌(Woodbox) అనే పాపులర్‌ కేఫ్‌  నడిపిస్తున్న పునీత్‌ ఖురానా(40) బలవనర్మణానికి పాల్పడ్డాడు. కల్యాణ్‌ విహార్‌ ప్రాంతం మోడల్‌ టౌన్‌ నివాసంలో మంగళవారం సాయంత్రం ఉరేసుకుని చనిపోయాడు. పునీత్‌ అతని భార్య మానిక జగదీష్‌ పహ్వాకి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే.. ఈ కేసులో భార్య సతాయింపుల కోణం బయటకు వచ్చింది.

తన భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్‌కాల్‌ ఆడియో.. అలాగే ఆమె ఎలా వేధించిందో చెబుతూ 54 నిమిషాల సెల్ఫ్‌ వీడియో రికార్డింగ్‌.. రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్‌ చేసుకున్నాడతను.  ఈ మేరకు కుటుంబ సభ్యులు కూడా మానికపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

2016లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. ఆపై వుడ్‌బాక్స్‌ కేఫ్‌ను ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ప్రారంభించారు. విడాకుల కేసు నేపథ్యంలో ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి.  పునీత్‌ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్‌ కాల్‌ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది.

మనం విడాకులు తీసుకున్నాం. అయినా కూడా నేను వ్యాపార భాగస్వామినే. కాబట్టి, నా బకాయిలు త్వరగా చెల్లించు అని మానిక, పునీత్‌తో వాగ్వాదం పెట్టుకుంది. పునీత్‌ ఎంత వేడుకుంటున్నా.. ఆమె మాత్రం కఠువుగానే మాట్లాడిందా ఆడియో క్లిప్‌లో. దీంతో.. చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానికను విచారణ జరపాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. అతుల్‌ సుభాష్‌(Atul Subash) కోసం పుట్టుకొచ్చిన #JusticIsDue హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియా నుంచి కనుమరుగు కాలేదు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిఖితా సింఘానియా బెయిల్‌ కోసం ప్రయత్నిస్తోంది. అయితే.. బిడ్డను సాకుగా చూపి బెయిల్‌ పొందలేరంటూ  బెంగళూరు కోర్టు నిఖిత లాయర్‌కు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపురి వాదనలు జనవరి 4వ తేదీన వింటామంది. మరోవైపు.. బెంగళూరు హైకోర్టులోనూ నిఖితా సింఘానియా ఓ పిటిషన్‌ వేసింది. అదే టైంలో.. మనవడి సంరక్షణ కోరుతూ అతుల్‌ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరపుతోంది. ఈ క్రమంలో నిఖితా సింఘానియా రిమాండ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని బెంగళూరు హైకోర్టు అతుల్‌ పేరెంట్స్‌కు సూచించింది.

కొడుకును వంకగా పెట్టుకుని  భార్య తన నుంచి డబ్బు గుంజుతోందని.. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను వేధిస్తోందంటూ 90 నిమిషాల వీడియో.. పేజీలకొద్దీ మరణ వాంగ్మూలం రాసి బెంగళూరు మరాథాహల్లి నివాసంలో అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య చేసుకన్నాడు. ఆయన సోదరుడు బికాస్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌ 108, రెడ్‌విత్‌ 3(5) కింద మారథాహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిఖితను, అటు ఆమె తల్లి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేసి బెంగళూరుకు తరలించారు. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధించిన మాట వాస్తవమేనని, అతని మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానూ ఎలాంటి ప్రమేయం లేదని నిఖిత మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement