పొలంలో చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ ఇద్దమ్మాయిలు.. అత్యాచారం జరిగిందా?

Dalit Sisters Found Hanging From Tree In Lakhimpur Kheri - Sakshi

ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లను కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. లఖింపూర్‌ ఖేరీలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. అనంతరం, తన బిడ్డల కోసం వెతుకుతుండగా.. ఓ చోట పొలం వద్ద విగతజీవులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతుళ్లు ఇద్దరిని.. దుంగడులు కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన తర్వాత ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణ జరగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని విషయాలు తెలుసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా..  ఇద్దరు దళిత అమ్మాయిలను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య. లఖింపూర్‌లో గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. యూపీలో  శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే యూపీలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top