
రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన ఆమె 10 జన్‌పథ్ నివాసంలో భేటీ జగనుంది. ఇందులో రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతోపాటు ఉభయ సభల ఉప నేతలు, పార్టీ చీఫ్ విప్‌లు, విప్‌లు పాల్గొంటారు. కొందరు సీనియర్ నేతలు కూడా పాలుపంచుకుంటారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్ట్ 21 వరకు పార్లమెంట్ సెషన్ కొనసాగనుంది.
ఆపరేషన్ సిందూర్‌తోపాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ తదితర అంశాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు కని్పస్తున్నాయి. బిహార్ ఓటరు జాబితా సవరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ఈసీ చర్య రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదేవిధంగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో మోదీ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడి, దేశానికి నష్ట కలిగించిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
అంతేకాదు, భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ప్రమాదం తన జోక్యంతోనే తొలగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటనలు చేయడంపైనా ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. పై అంశాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలకు కాంగ్రెస్ పార్లమెంట్‌లో పట్టుబట్టే ఛాన్సుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రమూకల దాడి, అమెరికా టారిప్‌లు వంటి వాటిపైనా ఇండియా కూటమి చర్చకు ప్రభుత్వాన్ని నిలదీస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం ఖరారైతే ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.