Narendra Modi: స్థానిక కట్టడియే కీలకం

Covid spreading rapidly in rural areas Says PM Narendra Modi - Sakshi

గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేయాలి

పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో మరింత ఎక్కువగా టెస్టులు చేపట్టాలి

ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవసరమైన పరికరాలు అందించాలి

గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ప్రణాళిక రూపొందించాలి

రాష్ట్రాలు పారదర్శకంగా కోవిడ్‌ గణాంకాలు వెల్లడించేలా ప్రోత్సహించాలి

కరోనాపై సమీక్షలో ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అధిక పాజిటివిటీ రేటున్న జిల్లాల్లో స్థానిక కట్టడియే ప్రస్తుత దశలో అత్యంత కీలకమన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ప్రణాళికను రూపొందించాలని, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించడంతో పాటు ఇతరత్రా అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ప్రాణవాయువును అందించే ఇతరత్రా ఉపకరణాల వినియోగంపై ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని, వీటి వినియోగానికి వీలుగా గ్రామీణ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్‌ ఉండేలా చూడాలన్నారు. మహానగరాల్లో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలను వేగవంతం చేసింది.  

పారదర్శకంగా గణాంకాలు వెల్లడించాలి
దేశంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నియంత్రణకు స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు.. రెండింటినీ ఉపయోగించి కరోనా పరీక్షలను మరింత పెంచాలని ప్రధాని ఆదేశించారు. రాష్ట్రాలు పారదర్శకంగా కోవిడ్‌–19 గణాంకాలను వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారు. తమ ప్రభుత్వాల కృషిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా గణాంకాలను కేంద్రానికి నివేదించాలని ఆయన అన్నారు.

కొత్త కేసులు, మరణాల సంఖ్యలు పలు రాష్ట్రాలు తక్కువ చేసి చూపుతున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా మహమ్మారి సంక్రమణను ఆపేందుకు అవసరమైన ఇంటింటికీ పరీక్షలు, నిరంతర నిఘాకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవసరమైన ఆరోగ్య పరికరాలను అందించి ఈ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో హోం ఐసోలేషన్, చికిత్సకు సంబంధించి అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌ను సులభతరమైన భాషలో అందుబాటులో ఉంచాలని మోదీ అధికారులను కోరారు.  

వెంటిలేటర్ల ఉపయోగంపై మదింపు చేయండి
అంతేగాక కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయన్న నివేదికలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అందించిన వెంటిలేటర్లు ఏమేరకు ఉపయోగంలో ఉన్నాయో మదింపు చేయాలన్నారు. వీటిని ఇన్‌స్టాల్‌ చేసి, పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వెంటిలేటర్లను సరిగ్గా వినియోగించేలా ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైతే మరోసారి శిక్షణ అందించాలన్నారు. దేశంలో కోవిడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం శాస్త్రవేత్తలు, విషయ నిపుణుల మార్గనిర్దేశనంలో జరుగుతోందని, అది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

వారానికి 1.3 కోట్ల టెస్టులు
అంతకుముందు ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో దేశంలో కోవిడ్‌  పరిస్థితులపై అధికారులు మోదీకి వివరించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల కరోనా పరీక్షలు జరగగా, ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్న పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు గురించి ప్రధానికి వివరించారు. ఇటీవల రోజుకి 4 లక్షల వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య హెల్త్‌ వర్కర్స్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం తగ్గుతోందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు, టెస్ట్‌లు, ఆక్సిజన్‌ లభ్యత, మౌలిక సదుపాయాలు, వ్యాక్సినేషన్‌ రోడ్‌ మ్యాప్‌ పరిస్థితులను ప్రధానికి అధికారులు వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top