
లైబీరియా ఓడ నుంచి చమురు లీకేజీ
కేరళ తీరం వెంబడి హై అలెర్ట్
కొల్లం: కేరళ తీరానికి సమీపంలో మునిగిన లైబీరియా ఓడ నుంచి చమురు లీకేజీ కొనసాగుతోంది. ఓడలోని కంటెయినర్లు ఒడ్డుకు కొడ్డుకు వస్తున్నాయి. కొల్లం, అలప్పుఝలోని తీరం సమీపానికి తొమ్మిది కంటెయినర్లు అలల తాకిడితో కొట్టుకు వచ్చాయని సోమవారం అధికారులు తెలిపారు. ఆయిల్ లీకవుతున్నందున తీర ప్రాంత జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. అధికారులతో సమావేశమైన సీఎం విజయన్ అక్కడి పరిస్థితులపై సమీక్ష జరిపారు.
అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెచ్చరించింది. ఆదివారం వేకువజామున సముద్రంలో మునిగిన ఈ ఓడలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు భారత తీర రక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. కొన్ని కంటెయినర్లలో ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ ఉందన్న వార్తలు అధికారులను కలవర పెడుతున్నాయి.
ఇది లీకై సముద్ర జలాలతో కలిస్తే మండే స్వభావమున్న ఎసిటలీన్ వాయువుగా మారుతుందని చెబుతున్నారు. ‘ఓడ నుంచి చమురు లీకవుతోంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల మేర వ్యాపిస్తూ సముద్ర పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం మధ్యలో 9 కంటెయినర్లు ఒడ్డుకు చేరాయి. మరో నాలుగు కంటెయినర్లు శక్తికులంగర హార్బర్ సమీపంలో, మూడు చావర సమీపంలో, ఒకటి చరియాజికల్ వద్ద, మరోటి త్రిక్కున్నపుఝ వద్ద కనిపించాయి.
ఆయిల్ లీకేజీని అరికట్టేందుకు ఐసీజీ ప్రయత్నాలు చేపట్టింది. చమురు తెట్టు ఏర్పడకుండా డార్నియర్ విమానం సాయంతో రసాయనాలను వెదజల్లుతున్నారని సీఎంవో వివరించింది. ఈ ఘటన టయర్–2 కేటగిరీకి చెందినది కావడంతో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో వనరులు, సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఐసీజీ డైరెక్టర్ జనరల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎంవో పేర్కొంది. మునిగిన ఓడలోని మరికొన్ని కంటెయినర్లు అలప్పుజ, కొల్లం, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల దిశగా కొట్టుకు వచ్చే అవకాశముందని తెలిపింది. ఒడ్డుకు చేరిన, సముద్ర జలాల్లో కనిపించే కంటెయినర్లు, ఇతర అసాధారణ వస్తువులను తాకవద్దని, వాటి సమీపంలో గుమికూడవద్దని ప్రజలను, మత్స్యకారులను హెచ్చరించింది.