న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.
దీనిలో ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు. కాగా కర్తవ్య పథ్, న్యూఢిల్లీ జిల్లా అంతటా విస్తృతమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గణతంత్ర వేడుకల భద్రత కోసం సుమారు 10 వేల మంది పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించినట్లు న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ మహాలా తెలిపారు.
ఢిల్లీ సరిహద్దులు, జిల్లా చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రతా సిబ్బందితో ఇప్పటికే తొమ్మిది రౌండ్ల బ్రీఫింగ్, రిహార్సల్స్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్‌క్లోజర్‌లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. ఆహ్వానితులు తమ పాస్‌లపై ఉన్న సూచనలను గమనించి, నిర్దేశిత మెట్రో స్టేషన్లను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
ఇది కూడా చదవండి: ఏఐ వాడకుంటే ‘ఫెయిల్’.. టెక్కీ ఇంటర్వ్యూ వైరల్


