కుక్కను తీసుకొచ్చినందుకు విమర్శించిన బీజేపీపై రేణుకాచౌదరి ఫైర్
న్యూఢిల్లీ: శీతాకాల సమా వేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వెంట కారులో ఒక వీధిశునకాన్ని తీసుకురావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా రేణుకా దీటుగా బదులిచ్చారు. సోమవారం ఉదయం ఒక వీధిశునకాన్ని ఆమె కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వెటర్నరీ వైద్యునికి చూపించేందుకు బయల్దేరారు.
డ్రైవర్ ఈమెను మార్గమధ్యంలో పార్లమెంట్ వద్ద దింపేసి వెటర్నరీ ఆస్పత్రికి వెళ్తామనుకున్నాడు. ఈలోపే పార్లమెంట్ వద్ద రేణుక కారులో కుక్క ఉండటం చూసి బీజేపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలు ఎంత ముఖ్యమైనవో కాంగ్రెస్ నేతలకు బోధపడటం లేదు. ఇలా కుక్కలను తీసుకొచ్చి తమాషా చేస్తున్నారు. ఈ అంశాన్ని రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలి ’’ అని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. దీంతో రేణుకాచౌదరి తీవ్రంగా స్పందించారు. ‘‘
ప్రభుత్వానికి అసలు కుక్కలంటే గిట్టదనుకుంటా. జంతువులు సమస్యలు చెప్పుకోలేవు. అయినా ఈ శునకం నా కారులో ఉందికదా. బయటకు రాలేదు. అయినా ఇది చాలా చిన్న కుక్క. ఇవేమీ కరవవు. కరిచే వాళ్లు వేరే ఉన్నారు. వాళ్లు పార్లమెంట్ లోపల ఉన్నారు. వీధిశునకాలను కాపాడకూడదని ఏ చట్టంలో రాసి ఉంది? ’’అని రేణుక వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వెటకారంగా స్పందించారు. ‘‘ ఆమె చెప్పింది నిజమే. కుక్కలు అస్సలు కరవవు. విపక్ష సభ్యులు ముఖ్యంగా ఆమె సొంత పార్టీ నేతలే ఇరుసభల్లో హంగామా సృష్టించి కరిచినంత పనిచేస్తారు. పార్లమెంట్‌కు మీరు కుక్కలను వెంట తీసుకొస్తే మేం అధికారాన్ని వెంట తీసుకొస్తాం’’ అని అన్నారు.


