లక్నో: నోయిడాలో టెక్కీ యువరాజ్ మోహతా విషాద మరణంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన వెంటనే నోయిడా అథారిటీ సీఈఓ ఎం. లోకేష్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఐదు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.
గత శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న యువరాజ్ మోహతా కారు నోయిడా సెక్టార్–150 వద్ద ప్రమాదానికి గురైంది. ఓ నిర్మాణ స్థలంలో ఉన్న నీటితో నిండిన గుంతలో ఆయన కారు పడిపోయింది. రక్షణ చర్యలు ఆలస్యమవడంతో యువరాజ్ నీటిలో ఊపిరాడక మరణించగా, అదే సమయంలో గుండెపోటు కూడా రావడంతో ఈ రెండు కారణాల వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అటాప్సీ నివేదికలో తేలింది.
ఈ ఘటనపై యువరాజ్ తండ్రితో పాటు స్థానికులు ప్రభుత్వ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ ప్రాంతంలో గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, రక్షణ చర్యలు తీసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యువరాజ్ మరణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నోయిడా అథారిటీ సీఈఓను పదవి నుంచి తొలగించారు. అదనంగా, మీరట్ జోన్ అదనపు డీజీపీ భాను భాస్కర్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్లే..
యువరాజ్ మరణంపై ప్రత్యక్ష సాక్షి, డెలివరీ ఏజెంట్ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. డెలివరీ ఏజెంట్ తన స్టేట్మెంట్‌లో నీటి గుంతలో పడిన యువరాజ్‌ను ప్రమాదం నుంచి రక్షించేందుకు చేపట్టే చర్యలు ఆలస్యమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఉంటే బ్రతికేవాడని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తగినంత బారికేడింగ్ లేకపోవడం, రిఫ్లెక్టర్లు లేకపోవడం వల్లే తరచూ అనార్ధాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నివాసితులు నిరసనలు చేపట్టారు.

ఇక బాధితుడి తండ్రి రాజేష్ మెహతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంజే విష్‌టౌన్ ప్లానర్ లిమిటెడ్, లోటస్ గ్రీన్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇద్దరు బిల్డర్లపై కూడా కేసు నమోదు చేశారు. నిరసనల నేపథ్యంలో, నోయిడా అథారిటీ సంఘటనా స్థలంలో బారికేడ్లను ఏర్పాటు చేసింది.


