
సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఖర్గే, రేవంత్, భట్టి, మీనాక్షి, మహేశ్‌గౌడ్, ఉత్తమ్, కొండా సురేఖ తదితరులు
బీసీ రిజర్వేషన్ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
తనతోపాటు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు జంతర్ మంతర్ వద్ద పోరాడతామని వెల్లడి
రాష్ట్రంలో కులగణన సర్వేకు సంబంధించి మా వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉంది
తెలంగాణ సర్వే దేశానికే రోల్ మోడల్..ఇది ‘రేర్’ సర్వే
సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారు
3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నారు.. ఇదొక సరికొత్త పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ హామీ మేరకు తమ ప్రభు త్వం కుల గణన చేసి, ఆ మేరకు బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ బిల్లులను లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్‌గాం«దీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. తాను, తన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలందరం జంతర్‌మంతర్ వద్ద పోరాడతామని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే దేశానికే రోల్‌మోడల్ అని అన్నారు.
ఈ సర్వేకు సంబంధించిన 88 కోట్ల పేజీల డేటా తమ వద్ద ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లులపై..ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంగా సీఎం మాట్లాడారు.
రాహుల్ హామీ మేరకు రాష్ట్రంలో కులగణన
‘భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, ఫిబ్రవరి 4వ తేదీన ఈ మేరకు సర్వేను ప్రారంభించి 2025, ఫిబ్రవరి 5న అంటే ఏడాది కాలంలోనే పూర్తి చేశాం. అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కులగణన చేపట్టే సమయంలో అనేకమంది అగ్ర కులాల నాయకులు నా వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారు. కాలనుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని నేను వారికి సూచించా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయి. అనేక మంది అమరులయ్యారు. కానీ 2009, డిసెంబర్ 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ నెరవేర్చారు. అదే తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని మా ప్రభుత్వం నెరవేర్చింది..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నిలుపుకుంటుంది
‘బీజేపీ నాయకులు చెప్పినవి ఏవీ చేయరు. గాంధీ కుటుంబం చెప్పిన ప్రతి మాటను నిలుపుకుంటుంది. కుల గణనకు సంబంధించి మా ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించింది. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారు. 3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నారు. ఇది తెలంగాణలో సరికొత్త పరిణామం. వీరంతా ఎవరని.. సర్వే, స్వతంత్ర నిపుణుల బృందాలు పరిశీలించాయి. వాళ్లంతా ఇంగ్లీష్ అభ్యసించిన ఉన్నత విద్యావంతులని తేలింది. ఈ సర్వే ప్రకారమే మేము బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం..’ ముఖ్యమంత్రి తెలిపారు.
మోదీ లీగల్లీ కన్వెర్డెడ్ బీసీ..
‘బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ. మేము కుల గణన చేపట్టబోమని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో చెప్పారు. రైతుల నల్ల చట్టాల విషయంలో రాహుల్ గాంధీ గళం విప్పిన తర్వాత మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కుల గణనకు అంగీకరించింది. ఇదంతా రాహుల్ గాంధీ ఘనతే. మేము చేపట్టిన సర్వే దేశానికి రోల్ మోడల్. ఇది తెలంగాణ మోడల్. నేను దీనిని ‘రేర్’ (ఆర్‌ఏఆర్‌ఈ) మోడల్ అంటున్నా. ఆర్‌ఏఆర్‌ఈ..అంటే ఏమిటో నేను త్వరలో వివరిస్తా..’ అని రేవంత్ అన్నారు.
సోనియాగాంధీ లేఖ నాకు నోబెల్, ఆస్కార్ లాంటిది
‘కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియాగాంధీ స్వహస్తాలతో నాకు లేఖ రాశారు. ఆ లేఖ నాకు నోబెల్, ఆస్కార్, జీవితకాల సాఫల్య పురస్కారాలతో సమానం. నేను ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ నాకు ప్రత్యేకంగా మిగిలిపోతుంది..’ అంటూ సీఎం భావోద్వేగానికి గురయ్యారు.
డిప్యూటీ సీఎం భట్టి పవర్‌పాయింట్ ప్రజంటేషన్
బీసీ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ప్రసంగించారు. మహేశ్‌గౌడ్ కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, స్వతంత్ర నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఖర్గే, రాహుల్‌తో సీఎం బృందం భేటీ
గురువారం ఉదయం ఖర్గే నివాసంలో ఆయనతో పాటు, రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులగణన సర్వే ప్రక్రియ, శాసనసభలో బిల్లుల ఆమోదం, పార్లమెంట్‌లో వాటిని ఆమోదింప జేయడంపై చర్చించారు.