సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు నిరసన మార్చ్ నిర్వహిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఓట్ల చోరీ, బీజేపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
శనివారం ఢిల్లీలో నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో భారీగా అరెస్టులు జరిగాయి. అంతేకాదు ఎక్కడికక్కడ ప్రముఖుల నిర్బంధాలు జరిగాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేను తన నానమ్మ అంత్యక్రియలకు కూడా హాజరయ్యేందుకు అనుమతించలేదని సీజేపీ నేతలు ఆరోపించారు.
సీజేపీ నేత అజింక్య షిండే మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ జంతర్ మంతర్‌కు నిరసన మార్చ్‌లు కొనసాగిస్తామని తెలిపారు. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థి నిరసనలు నిర్వహిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నేతలు ప్రకటించారు.
ఢిల్లీలో శనివారం 1,500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, మాణిక్ సర్కార్ వంటి మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: అయోధ్య నుంచి మీరు పోటీ చేస్తే.. నేనూ బరిలోకి దిగుతా: సీఎం యోగి సవాల్


