లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేళ అయోధ్య కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయోధ్య నుంచి పోటీ చేయాలంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విసిరిన సవాల్‌కు సీఎం యోగి ఆదిత్యనాథ్ దీటుగా స్పందించారు. అఖిలేశ్ అయోధ్య నుంచి నామినేషన్ వేస్తే.. తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.
బలరాంపూర్ జిల్లాలో రూ.800 కోట్లకు పైగా విలువైన 78 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య పవిత్ర స్థలమని, రాజకీయ పోరాటానికి మాత్రమే పరిమితం చేయలేమని ఆయన పేర్కొన్నారు.
अखिलेश जी, मैं आपको ऑफर करता हूं। आइए, आप भी श्री अयोध्या धाम में नामांकन करिए और मैं भी करता हूं... https://t.co/R4Jtz6vNOw
— Yogi Adityanath (@myogiadityanath) October 10, 2026
అయితే యోగి సవాల్‌పై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. బీజేపీని ఓడించడానికి తమ పార్టీ యువ అభ్యర్థి చాలని వ్యాఖ్యానించారు. అయోధ్య నుంచి తేజ్ నారాయణ్ పాండేను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓటమిని ఆయన ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.
రామమందిరానికి వచ్చిన విరాళాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై అఖిలేశ్ విమర్శలు గుప్పించారు. దీంతో 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయోధ్య రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చదవండి: మోదీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ ఫైర్


