ఢిల్లీలో సీజేపీ నిరసన.. రైల్వేశాఖ కీలక నిర్ణయం | CJP Protest Row In Delhi, Railways Cancels Trains For 10 Hours Amid Security Concerns, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో సీజేపీ నిరసన.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

Oct 9 2026 12:27 PM | Updated on Oct 9 2026 12:44 PM

CJP protests are a key decision for the Railways

ఢిల్లీ: రేపు  శనివారం (అక్టోబర్‌ 10) ఢిల్లీలో ప్రత్యేక ఆంక్షల నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు 10 గంటల పాటు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శాంతిభద్రతల కారణాల రీత్యా ఢిల్లీలోని అన్ని మెట్రో రైల్వే స్టేషన్లను పోలీసులు మూసివేస్తున్నట్లు సమాచారం.

ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. "ఢిల్లీలోని న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్ర రోడ్డు రద్దీ ఏర్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. ట్రాఫిక్ సలహాలు ఈ విషయాన్నే  సూచిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్న నిరసన ప్రదర్శనల నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తవచ్చు" అని ప్రకటనలో తెలిపింది.

ప్రయాణికులు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మళ్లీ పునరావృతం కాకుండా చూసేందుకు రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను అవి బయలుదేరాల్సిన ప్రారంభ స్టేషన్‌ నుంచే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

హౌరా, సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు  రద్దు
ఢిల్లీలో శనివారం తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ నుంచి బయలుదేరే రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈస్టర్న్ రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఈ రైళ్లు, మరుసటి రోజు ఢిల్లీలోని న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉన్న రోడ్డు రద్దీ కారణంగా రద్దయ్యాయి.

రద్దయిన రైళ్లలో 12301 నంబర్ హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, 12313 నంబర్ సీల్దా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈ రెండు రైళ్లు అక్టోబర్ 9వ తేదీన తమ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో నిరసన ప్రదర్శనల కారణంగా రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిరసనకు అనుమతి లేదు

అయితే సర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో జరిగిన ఆందోళనలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ రైల్వేశాఖ రైళ్లను రద్దు చేయడం గమనించదగ్గ విషయం.


ఇదీ చదవండి: సీజేపీ నిరసనకు అనుమతి నిరాకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement