సీజేపీ ధర్నా ఎఫెక్ట్‌.. కేంద్రం కీలక ఆదేశాలు! | CJP Protest Effect: Delhi on High Alert Centre Issues Security Directives | Sakshi
Sakshi News home page

సీజేపీ ధర్నా ఎఫెక్ట్‌.. కేంద్రం కీలక ఆదేశాలు!

Oct 10 2026 7:27 AM | Updated on Oct 10 2026 7:30 AM

CJP Protest Effect: Delhi on High Alert Centre Issues Security Directives

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ నిరసనల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ (CJP) తలపెట్టిన ధర్నా నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఇందుకోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి సీజేపీ సభ్యులు, మద్దతుదారులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు చేపట్టాలని హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం వివిధ రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీకి వెళ్లే సరిహద్దు మార్గాల్లో పోలీసుల నిఘా పెంచాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. నిరసనల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తుల కదలికలను గమనించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. ఆకతాయిలు, అరాచక శక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఢిల్లీ పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని సూచించింది.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
నిరసనల సందర్భంగా ప్రజా శాంతికి విఘాతం కలగకుండా, కీలక ప్రాంతాలు, మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న చట్టపరమైన నిబంధనల పరిధిలోనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రాల మధ్య, ఢిల్లీ పోలీసులతో సమన్వయం నిరంతరం కొనసాగించాలని ఆదేశించింది. ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో కేంద్రం భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి: జంతర్‌ మంతర్‌కు జస్ట్‌ 1000 మందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement