న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టాలంటే పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందా? లేక ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలా? నిరసనల్లో పాల్గొనే వారి సంఖ్యను బట్టి వేదికలను కూడా మార్చుకోవాల్సి ఉంటుందా? దేశ రాజధానిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేపట్టే ఆందోళనలపై ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నిరసనలకు వర్తించే నిబంధనలు, అనుమతి ప్రక్రియ, పోలీసులు చేపట్టే చర్యలపై పలువురు ఆరా తీస్తున్నారు.
శాంతియుత నిరసన హక్కు ఉన్నా..
భారత రాజ్యాంగం పౌరులకు శాంతియుతంగా సమావేశమై నిరసన తెలిపే హక్కును కల్పించింది. అయితే ఈ హక్కు సంపూర్ణమైనది కాదు. ప్రజా భద్రత, శాంతిభద్రతలు, రవాణా వ్యవస్థ, ఇతర పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా నిరసనలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలనుకునే రాజకీయ పార్టీలు, సంస్థలు, పౌర సమూహాలు నిర్దేశిత నిబంధనలను పాటించాలి. సుప్రీంకోర్టు కూడా నిరసన తెలిపే హక్కుతోపాటు ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని పలు తీర్పుల్లో స్పష్టం చేసింది.
జంతర్ మంతర్ వద్ద..
జంతర్ మంతర్ వంటి నిర్దేశిత నిరసన ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు నిరసనల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటికి అనుగుణంగా ఢిల్లీ పోలీసులు 2022లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం నిరసన, ఊరేగింపు లేదా ప్రదర్శనకు ముందుగా సంబంధిత అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. కేవలం పోలీసులకు సమాచారం అందించామని చెప్పడం మాత్రమే అనుమతి లభించినట్లు కాదని అధికారులు చెబుతున్నారు.
పది రోజుల ముందే దరఖాస్తు..
జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహించాలనుకునేవారు కనీసం పది రోజుల ముందుగా న్యూఢిల్లీ జిల్లా డీసీపీకి దరఖాస్తు సమర్పించాలి. నిరసన ఉద్దేశం, తేదీ, ప్రారంభ,ముగింపు సమయాలు, ప్రతిపాదిత ప్రదేశం, నిర్వాహకుల పేర్లు, సంప్రదింపు వివరాలను అందులో పేర్కొనాలి. అంతేకాకుండా కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారనే అంచనా, నిరసన స్వరూపం, వేదిక ఏర్పాట్లు, లౌడ్‌స్పీకర్ల వినియోగం వంటి వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఊరేగింపు నిర్వహించాలనుకుంటే దాని మార్గాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఈ సమాచారంతో పోలీసులు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ఎక్కడపడితే అక్కడ నిరసనలు కుదరవు!
ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా పరిసరాల్లో ప్రజా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇండియా గేట్, సీ-హెక్సాగన్, మాన్‌సింగ్ రోడ్, జన్‌పథ్, కర్తవ్య పథ్, చుట్టుపక్కల పచ్చిక బయళ్ల వంటి ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలపై పరిమితులు వర్తిస్తాయి. ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న నిర్దిష్ట ఆదేశాలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలి. తమకు నచ్చిన వీధిలో లేదా ప్రభుత్వ ప్రాంగణంలో అనుమతి లేకుండా నిరసన నిర్వహించేందుకు వీల్లేదు. పరిస్థితులను బట్టి పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలను సూచించే అవకాశం ఉంది.
నిరసనకారుల సంఖ్యను బట్టి..
నిరసనల్లో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా ఢిల్లీ పోలీసులు మూడు ప్రధాన వేదికలను నిర్దేశించారు. 1,000 మంది వరకు పాల్గొనే నిరసనలకు జంతర్ మంతర్, 1,000 నుంచి 50,000 మంది వరకు పాల్గొనే కార్యక్రమాలకు సెంట్రల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్, 50,000 మందికి పైగా పాల్గొనే భారీ సమావేశాలకు ఔటర్ ఢిల్లీలోని బురారీ మైదాన్ కేటాయించినట్లు సమాచారం. ఈ వర్గీకరణ ప్రకారం భారీ జనసమీకరణకు జంతర్ మంతర్ వేదికను మాత్రమే కోరడం సాధ్యం కాకపోవచ్చు. అంచనా జనసంఖ్య, భద్రతా అవసరాలు, అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
అనుమతి లేకుంటే ఏం జరుగుతుంది?
నిరసనకు అనుమతి నిరాకరించే అధికారం పోలీసులకు ఉంది. భద్రతా ముప్పులు, ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు కలిగే అసౌకర్యం, అత్యవసర సేవలకు ఆటంకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే షరతులు విధించవచ్చు లేదా ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని సూచించవచ్చు. అనుమతి లేకుండా నిరసన నిర్వహించేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత ప్రాంతంలో అమల్లో ఉన్న ఆదేశాలను బట్టి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పరిస్థితులను బట్టి గుమిగూడిన వారిని చెదరగొట్టడం, అదుపులోకి తీసుకోవడం, నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే ఇవన్నీ.. వర్తించే చట్టాలు, అమల్లో ఉన్న ఆదేశాలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నిరసన హక్కును పరిరక్షిస్తూనే ప్రజా శాంతిభద్రతలు, పౌరుల రాకపోకలు, భద్రతకు భంగం కలగకుండా చూడటమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.
ఇదీ చదవండి: దసరా సెలవులు.. ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా?


