
ఫాస్ట్‌ఫుడ్ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. మీరు ముక్కు తుడుచుకుంటూ, లొట్టలేసుకుంటూ తిన్నది ‘చిల్లీ చికెన్’ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే.. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి.
తమిళనాడు సేలం జిల్లా డేనిష్ పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పేర్లను కమల్, సెల్వంగా చెప్పిన నిందితులు.. విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలను తెలియజేశారు. కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్న వీళ్లిద్దరూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు..
కొన్ని హోటల్స్‌కు చిల్లీ చికెన్ తదితర ఐటెమ్స్‌ను వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి నేరుగా చేరవేస్తున్నారట. తమ కంటే ముందు కొంతమంది.. కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నారంటూ మరో బాంబ్ పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు.
సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
