పోలీస్‌ ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబర్‌.. | Sakshi
Sakshi News home page

చత్తీస్‌ఘడ్‌ పోలీసుల వినూత్న ఆలోచన..

Published Thu, Jan 28 2021 5:58 PM

chattisgarh police to launch whatsapp number to register complaints - Sakshi

రాయ్‌పూర్‌: పోలీసు వ్యవస్థను సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు 'సమాధాన్‌' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు, అందులో భాగంగా సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు చత్తీస్‌ఘడ్‌ డీజీపీ అవస్తి వెల్లడించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే విధంగా ఈ వాట్సాప్‌ నంబర్‌ను ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాట్సాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను డీజీపీ ఆఫీసు సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు. 

అయితే ఫిర్యాదులను నేరుగా వాట్సాప్‌ నంబర్‌ను కాకుండా తొలుత సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేసేందుకు కృషి​ చేయాలని, అక్కడ సరైన స్పందన లేకుంటే వాట్సాప్‌ చేయాలని సూచించారు. పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో స్థానికంగా ఎదురయ్యే ఒత్తిళ్ల కారణంగా కొందరు పోలీసులు ఫిర్యాదులను స్వీకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని, అటువంటి పరిస్థితుల్లో బాధితులు నేరుగా ఈ నంబర్‌కు వాట్సాప్‌ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని డీజీపీ పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో సరిగా వ్యవహరించని పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రంలో పోలీసులు ఈ రకమైన ఆలోచనతో ముందుకు రావడం హర్షనీయమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement
Advertisement