
న్యూఢిల్లీ, సాక్షి: ఎంపీల జీతభత్యాల విషయంలో కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఉభయ సభల్లోనూ ఎంపీలకు జీతాలను పెంచుతున్నట్లు సోమవారం అధికారికంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పెంపు అమల్లో ఉండడం.
ప్రస్తుతం ఎంపీల జీతం రూ. లక్ష ఉండగా.. దానిని లక్షా 24 వేలకు పెంచింది. అలాగే దినసరి భత్యం రూ.2 వేల నుంచి 2,500కు పెంచింది. మాజీ ఎంపీల పెన్షన్ రూ.25 వేల నుంచి 31 వేలకు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత పార్లమెంట్ యాక్ట్ 1954కు సవరణ చేసింది. అయితే రెండేళ్లుగా ఇది ఆచరణలో ఉన్నప్పటికీ.. చట్టసభ సభ్యులకు పరిహారాన్ని పెంచాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా ఈ ‘సర్దుబాట్ల’ను అధికారికంగా తెలియజేసిందంతే.
ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం చట్ట సభ్యుల జీతాలను 100 శాతం పెంచుకుని వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలూ చెలరేగుతున్నాయి.