అమల్లోకి సీఏఏ | Sakshi
Sakshi News home page

అమల్లోకి సీఏఏ

Published Tue, Mar 12 2024 5:56 AM

Centre notifies implementation of Citizenship Amendment Act Rules - Sakshi

వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం

నియమ నిబంధనలతో నోటిఫికేషన్‌ జారీ

లోక్‌సభ ఎన్నికల ముంగిట కీలక పరిణామం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది.

సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం తాలూకు నియమ నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కలి్పస్తున్న తొలి చట్టమిది! పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కలి్పంచడం దీని ఉద్దేశం.

2014 డిసెంబర్‌ 31కి ముందు ఆ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ (సవరణ) నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘సీఏఏ చట్టం–2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్‌లైన్‌లో సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచాం’’అని ఆయన వెల్లడించారు.

బీజేపీ హర్షం, విపక్షాల ధ్వజం
సీఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వెలిబుచ్చారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చి చూపారంటూ అభినందించారు. పాక్, బంగ్లా, అఫ్గాన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనారిటీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై మండిపడ్డాయి.

ఇది దేశ సమగ్రతకు సీఏఏ విఘాతమంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఆప్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, మజ్లిస్‌ తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. దీన్ని కేవలం బీజేపీ ఎన్నికల లబ్ధి ఎత్తుగడగా అభివరి్ణంచాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అసోంలలో మతపరమైన విభజన తెచ్చి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ చర్యకు దిగిందని ఆరోపించాయి. ఆమ్నెస్టీ ఇండియా కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది.

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్‌లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. సీఏఏను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. ఇది సమాజంలో మతపరంగా విభజనకు దారి తీస్తుందదన్నారు.

ప్రజల హక్కులను హరించే ఎలాంటి మత, కుల, సామాజికపరమైన వివక్షనైనా తుదికంటా వ్యతిరేకించి తీరతామని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అసోంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

పాక్‌ తదితర దేశాల నుంచి వచి్చన ముస్లిమేతర శరణార్థులు మాత్రం దీన్ని స్వాగతించారు. ముస్లింల పట్ల సీఏఏ పూర్తిగా వివక్షపూరితమంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019లోనే దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఏఏ అమలు నిర్ణయం వెలువడ్డ నిమిషాల్లోనే సంబంధిత ఇ–గెజిట్‌ వెబ్‌సైట్‌ క్రాషైంది. దాన్ని కాసేపటికి పునరుద్ధరించారు.

సీఏఏలో ఏముంది...!
► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు.
► 2014 డిసెంబర్‌ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు.
► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కలి్పస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు.
► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది.
► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు.


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement