
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించారు. ప్రవీణ్ 2023 మేలో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సుబోధ్ జైస్వాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్–2003 ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు. ప్రవీణ్ సూద్ రెండేళ్ల పదవీకాలం మే 24తో ముగియనుంది. దీంతో సీబీఐ చీఫ్‌ను ఎన్నుకోవడానికి ప్రధాని మోదీ ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. బళ్లారి, రాయచూర్ ఎస్పీగా పనిచేసి బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై మూడేళ్ల పాటు మారిషస్‌లో పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు మైసూరు నగర పోలీసు కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011 వరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్‌లో అడిషనల్ పోలీస్ కమిషర్, 2013–14 వరకు కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆ తరువాత రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ఏడీజీపీగా, అడ్మినిస్ట్రేషన్ ఏడీజీపీగా, కర్ణాటక డీజీపీగా పనిచేశారు.