క్యాన్సర్ ఔషధాల ధరలో మార్జిన్ 30% దాటొద్దు
ఎంఆర్‌పీలో వాణిజ్య మార్జిన్ తగ్గడంతో దిగిరానున్న ధరలు
మార్జిన్‌కు పరిమితి విధించిన మోదీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేవలం రూ.2,700 ఖర్చయ్యే ఒక క్యాన్సర్ ఔషధాన్ని ఏకంగా రూ.27,000 గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ) ముద్రించి విక్రయిస్తున్న ఉదంతాలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో మోదీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం కల్గేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాన్సర్ ఔషధాల ఎంఆర్‌పీ ధరలో వ్యాపారుల వాణిజ్య మార్జిన్ 30 శాతం దాటకూడదని ప్రభుత్వం పరిమితి విధించింది.
దీంతో బ్రాండెడ్, జనరిక్, దేశీయ, విదేశీ, పేటెండెడ్, నాన్–పేటెంటెడ్ నాన్–షెడ్యూల్డ్ యాంటీ–క్యాన్సర్ డ్రగ్స్ ధరలు భారీగా తగ్గే ఆస్కారముంది. దాదాపు 70 శాతం ధరలు తగ్గే అవకాశం ఉందని వాణిజ్యవర్గాలు అంచనావేస్తున్నాయి. ఈనెలాఖరు నుంచి మార్జిన్ పరిమితి నిర్ణయం అమల్లోకి వచ్చే ఆస్కారముంది. ప్రాణాధారమైన కీలక ఔషధాల ధరలు తగ్గడంతో ఈ డ్రగ్స్ సామాన్యులకు సైతం నిరంతరం అందుబాటులో ఉండనున్నాయి.
35 రకాల పేటెంటెడ్ ఔషధాలు సహా మొత్తంగా 110 యాంటీ–క్యాన్సర్ డ్రగ్స్ ధరలు దిగిరానున్నాయి. ‘‘ఇష్టారీతిగా ధరలను ముద్రించి రోగుల నెత్తిన ధరల బండ పడేసే విధానానికి స్వస్తిపలికి వాణిజ్య మార్జిన్ హేతుబద్ధత(టీఎంఆర్)ను తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశం’’అని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. ధరలు 70 శాతం దాకా తగ్గే నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సొమ్ము ఏటా రూ.2,500 కోట్లమేర ఆదా అయ్యే ఆస్కారముంది.
సెపె్టంబర్ 28వ తేదీన 16 శాతం ఏకరూప మార్జిన్ కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘రిటైలర్‌కు రూ.2,700కే లభించే ఒక క్యాన్సర్ డ్రగ్‌ను రోగికి ఏకంగా రూ.27,000కు అమ్మడం ఎంత దారుణం. ఇది పట్టపగలే నిలువెత్తు దోపిడీ’’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయానికి, ఈ కేసుకు ఎలాంటి సంబంధం, సందర్భం లేదు అని ప్రభుత్వవర్గాలు వివరించాయి. తగ్గిన మార్జిన్ ఖరారయ్యాక ఔషధాల నూతన ధరల వివరాలు సంబంధిత ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
ధరల్లో ఎందుకంత తేడా?
దేశంలో విక్రయించే ఔషధాలను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. అత్యావశ్యక మందులతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(ఎన్‌ఎల్‌ఈఎం)ను రూపొందించింది. వీటి ధరలు ఏటా అంతగా పెరగవు. వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. కానీ వీటిలో కేవలం 18 శాతం ఔషధాలే ఉన్నాయి. మిగతా 82 శాతం ఔషధాలను నాన్–షెడ్యూల్డ్ జాబితాలో పెట్టారు. వీటి ధరలు ఏటా 10 శాతం అంతకంటే ఎక్కువే పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. వీటిని ఇష్టారీతిగా ఎంఆర్‌పీ ముద్రించి విక్రయిస్తుండటంతో క్యాన్సర్ రోగుల జేబుకు పెద్ద చిల్లు పడుతోంది. కొన్ని ఖరీదైన మందులపై దిగుమతి సుంకం, జీఎస్టీ మినహాయింపులు ఇచ్చినా సామాన్యులకు ప్రయోజనం పెద్దగా ఉండట్లేదు. భారత్‌లో ప్రతి సంవత్సరం కొత్తగా అన్ని రకాల క్యాన్సర్ రోగులు 15 లక్షల మంది పెరుగుతున్నారు.


