మహిళా రిజర్వేషన్లకు సరికొత్త ‘మార్గం’  | Center deliberates on amending the Womens Reservation Bill 2026 | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్లకు సరికొత్త ‘మార్గం’ 

Apr 21 2026 3:48 AM | Updated on Apr 21 2026 4:58 AM

Center deliberates on amending the Womens Reservation Bill 2026

బిల్లులో సవరణలపై కేంద్రం సమాలోచనలు 

న్యాయ నిపుణులతో సంప్రదింపులు 

మళ్లీ పార్లమెంట్‌ ముందుకు కొత్త బిల్లు?

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల’ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో పార్లమెంట్‌లో ఎదురైన సాంకేతిక, రాజ్యాంగపరమైన ఆటంకాలను అధిగమిస్తూ, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సరికొత్త రూపం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, న్యాయస్థానాల్లో నిలబడేలా పటిష్టమైన సవరణలతో బిల్లును మళ్లీ పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  

ఏమిటా కొత్త వ్యూహం?  
ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు గట్టెక్కాలంటే అదే పాత పద్ధతిలో కాకుండా ‘ప్రత్యామ్నాయ మార్గాల’ను అన్వేషించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతోంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని భవిష్యత్తులో ఎవరూ కోర్టులో సవాల్‌ చేయకుండా, చేసినా అది వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధమైన లోపాలను సరిదిద్దడంపై దృష్టి పెట్టింది.

 గతంలో బిల్లు నిలిచిపోవడానికి కారణమైన వివాదాస్పద అంశాలపై చర్చలు జరపకుండానే, ఒక మధ్యేమార్గం ద్వారా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేలా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా వారికి లబ్ధి చేకూరేలా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. న్యాయ సలహాలు తీసుకోవడంతోపాటు ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో సవరణలు చేయబోతున్నారు. కోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేసి లోపాలు లేని ముసాయిదా రూపొందించబోతున్నారు.  

నిపుణుల కమిటీ కసరత్తు  
మహిళా రిజర్వేషన్ల విషయంలో సీనియర్‌ న్యాయ సలహాదారులు ప్రస్తుతం సవరణల ముసాయిదాపై తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రభుత్వ సంకల్పం చెక్కుచెదరలేదని, ఈ విషయంలో చట్టపరమైన చిక్కులు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నామని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని అధికార పక్షం చెబుతోంది. మొత్తానికి శాసన, పరిపాలన వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement