
ఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాక్ తగిలింది. వారిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.
వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015-2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ.. ఆ నిధులను శెట్టి వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.
ఫిర్యాదులో భాగంగా.. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పరిచయం అయినట్టు కొఠారీ తెలిపారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
#BREAKING | Legal Trouble For Actress #ShilpaShetty
- Shilpa Shetty, Raj Kundra booked.
- Businessman claims Rs 60 cr fraud; F.I.R filed.
- Businessman alleges cheating in deal, claims Rs 60 cr misused for personal expenses. pic.twitter.com/wTgDZtfu2v— TIMES NOW (@TimesNow) August 14, 2025
వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత, 2017లో మరో ఒప్పందంలో విఫలమవడంతో బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తనకు తెలిసిందని కొఠారీ వాపోయారు. ఇక, కొఠారీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం జరిగిన మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, ఈ కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.